close
Choose your channels

తమ్ముడికి జగన్ అంటే ప్రాణం.. నాకు సింహంలా కనిపిస్తారు!

Sunday, May 26, 2019 • తెలుగు Comments

తమ్ముడికి జగన్ అంటే ప్రాణం.. నాకు సింహంలా కనిపిస్తారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా పూరీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ వైఎస్ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. పూరీ సోదరుడు గణేశ్‌ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడని విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వార్ వన్‌సైడ్ అయ్యేసరికి మతిపోయింది!

"ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూస్తున్నా. మా తమ్ముడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అటు పక్క ఉన్నది రాష్ట్రమంతి అయ్యన్నపాత్రుడు కాబట్టి వాడు గెలవడం చాలా కష్టం అనుకున్నాం. కానీ వార్ వన్‌సైడ్ అయిపోయేసరికి మతిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రహస్యంగా మీటింగ్ పెట్టుకుని జగన్‌కే ఓటేద్దామనుకున్నారేమో... ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు... జగన్‌కు హ్యాట్సాఫ్! ఎందుకంటే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఒంటరివాడైపోయాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు" అని పూరీ ఆనందం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్‌ ముఖంలో గర్వంలేదు..!

"విజయం సాధించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయ గర్వం లేదు. పొగరు లేదు. మౌనంగా ఉన్నారు. సేద తీరుతున్నట్టు కనిపించారు. రాజన్న కొడుకు అనిపించుకున్నారు. జగన్ యోధుడు. దేవుడి నిర్ణయం, ప్రజా తీర్పు వల్ల ఈ విజయం దక్కిందని జగన్ అన్నారు. నా ఉద్దేశంలో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయమే గొప్పది" అని పూరీ జగన్ చెప్పుకొచ్చారు.

జగన్‌ అంటే ప్రాణం!

"నా తమ్ముడికి జగన్ అంటే ప్రాణం. ఆయన ఫోటో చూసినా, వీడియో కనిపించినా తెగ ఎగ్జైట్ అయిపోతాడు. వాడు ఎందుకలా ఫీలవుతాడో నాకు ఇవాళ అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి చెయ్యి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను కానీ నాకు యోధులంటూ ఇష్టం. నాకు జగన్ సింహంలా కనిపిస్తున్నారు..." అని పూరీ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. పూరీ జగన్ లేఖకు పలువురు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గురువును మించిన శిష్యుడు!!

ఇదిలా ఉంటే.. పెట్ల ఉమాశంకర్ గణేష్ తన రాజకీయ గురువు, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై బంపర్ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఏకంగా 22,300 మెజార్టీని సాధించారు. గణేష్‌కు 90,077 ఓట్లు పోలైతే.. టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకు కేవలం 67,777 మాత్రమే ఓట్లు వచ్చాయి. టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉమా శంకర్.. గ్రామ స్థాయిలో ముఖ్య కార్యకర్తగా ఎదిగారు. ఆ తర్వాత వైసీపీలో చేరి గురువుకే ప్రత్యర్థిగా మారి 2014లో అయ్యన్నకు గట్టిపోటీనే ఇచ్చి.. స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ 2019 ఎన్నికల్లో మాత్రం ఏకంగా 22,300 మెజార్టీని సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz