Download App

Raa Raa Review

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం హార‌ర్ చిత్రాల ట్రెండ్ న‌డుస్తుంది. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు హార‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇప్పుడు ఆ కోవ‌లోకి సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూడా చేరారు. 124 సినిమాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి మెప్పించిన  శ్రీకాంత్ 125వ చిత్రంగా హార‌ర్ చిత్రం `రా..రా`లో న‌టించారు. శ్రీకాంత్ న‌టించిన తొలి హార‌ర్ చిత్రం `రా..రా` ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందో?  లేదో ?  తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి ఓ లుక్కేద్దాం...

క‌థ‌:

తండ్రి స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కావ‌డంతో రాజ్‌కిర‌ణ్ (శ్రీకాంత్‌) కూడా పెద్ద డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటాడు. అయితే రాజ్‌కిర‌ణ్ చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అవుతాయి. అప్పుల పాల‌వుతాడు. తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణిస్తాడు.. త‌ల్లి హాస్పిట‌ల్ పాల‌వుతుంది. దాంతో రాజ్‌కిర‌ణ్ మంచి హిట్ కొట్టి త‌న త‌ల్లికి కానుక ఇవ్వాల‌నుకుంటాడు. అందుకోస‌మ‌ని ఓ హార‌ర్ సినిమాను డైరెక్ట్ చేయాల‌నుకుంటాడు. ఓ పాడుప‌డ్డ బంగ‌ళాను చూసి అందులో కొంత మంది యూనిట్ స‌భ్యులు(జీవా, నాజియా, న‌ల్ల‌వేణు త‌దిత‌రులు)తో మ‌కాం వేసి క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డానికి రెడీ అవుతారు. అయితే ఆల్‌రెడీ ఆ బంగ‌ళాలో ఉన్న ఆత్మ‌లు (ర‌ఘుబాబు, హేమ, అలీ త‌దిత‌రులు) వీరిని భ‌య‌పెట్టి బంగ‌ళా నుండి బ‌య‌ట‌కు పంపేయాల‌నుకుంటాయి. కానీ రాజ్‌కిర‌ణ్ అండ్ కో దెబ్బ‌కి ఈ ఆత్మ‌లు భ‌య‌ప‌డి పారిపోతాయి. కానీ అస‌లు ట్విస్టు అక్క‌డే మొద‌లవుతుంది. ఆ బంగ‌ళాలోకి మ‌ణి కంద‌న‌(సీతా నారాయ‌ణ్‌) ఎంట్రీ ఇస్తుంది. అస‌లు సీతా నారాయ‌ణ్ ఎవ‌రు?  రాజ్‌కిర‌ణ్ పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

శ్రీకాంత్ వంటి పెద్ద హీరో చేయాల్సిన సినిమా కాదు. శ్రీకాంత్‌కి ఓ హార‌ర్ సినిమా చేయాల‌నిపించ‌డంలో తప్పు లేదు. కానీ క‌థ‌, క‌థ‌నం, టెక్నిక‌ల్ వేల్యూస్ లేని సినిమాలో చేయ‌డం ద్వారా శ్రీకాంత్ స్థాయి త‌గ్గింద‌నే చెప్పాలి. ఏదో మొహ‌మాటానికి శ్రీకాంత్ సినిమా చేసిన‌ట్లుంది. సినిమాలో శ్రీకాంత్ పాత్ర చిత్రీక‌ర‌ణ‌, స‌న్నివేశాలు చూసి ప్రేక్ష‌కుడు త‌ల ప‌ట్టుకుంటాడు. శ్రీకాంత్ సినిమా అంటే ఉన్న ఆస‌క్తి కాస్త చచ్చిపోతుంది. ఇక హీరోయిన్స్‌గా న‌టించిన సీతా నారాయ‌ణ్‌, నాజియాలు గ్లామ‌ర్ ప‌రంగా...పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా సినిమాకు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. సినిమాకు డైరెక్ట‌ర్ లేమీ స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంది. క‌థ‌, క‌థ‌నం స‌రిగానే లేదు. పూర్ణ సినిమాటోగ్ర‌ఫీ బాలేదు. ఇక ర్యాప్ రాక్ ష‌కీల్ ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మైన‌స్ అయింది. సినిమా క‌థ‌నానికి వెన్నుద‌న్నుగా నిల‌వాల్సిన సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం సినిమాకు పెద్ద డ్రా బాక్ అయాయి. అలీ, ర‌ఘుబాబు, హేమ‌, అదుర్స్ ర‌ఘు, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, పోసాని , న‌ల్ల‌వేణు స‌హా పెద్ద కామెడీ గ్యాంగ్ ఉన్న‌ప్ప‌టికీ వీరి చుట్టూ అల్లిన స‌న్నివేశాలు మ‌రి సిల్లీగా అనిపిస్తాయి. మొత్తంగా రా..రా సినిమా గురించి పాజిటివ్స్ వెతుక్కోవాల్సి వ‌స్తుంది.

బోట‌మ్ లైన్:  రా.. రా.. అని పిలిచార‌ని వెళ్లారో...!

Rating : 1.5 / 5.0