Download App

Radha Review

రన్‌రాజా రన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానంభవతి వంటి వరుస సినిమాలతో సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న హీరో శర్వానంద్‌ మరో హిట్‌ కోసం చేసిన ప్రయత్నమే 'రాధ'. కాస్తా భిన్నంగా శర్వానంద్‌ ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రాధ చిత్రాన్ని సెలక్ట్‌ చేసుకున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించడం విశేషం. మరి రాధ చిత్రం శర్వానంద్‌ ఎలాంటి సక్సెస్‌నిచ్చిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..

కథ:

రాధాకృష్ణ(శర్వానంద్‌) కృష్ణుడి భక్తుడు. చిన్నప్పట్నుంచి భగవద్గీతను బాగా వంటబట్టించుకుంటాడు. ఓ సందర్భంలో తనను ప్రమాదం నుండి కాపాడిన పోలీస్‌నే కృష్ణుడిగా భావిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం అప్పట్లో శ్రీకృష్ణుడు పుట్టినట్లు ఈ కాలంలో పోలీస్‌ పుట్టాడని భావిస్తాడు. రాధాకృష్ణ పెద్దయిన తర్వాత పోలీస్‌ కావాలనే కోరిక ఇంకా బలంగా మారుతుంది. ఓ సందర్భంలో పోలీసులకు క్రిమినల్స్‌ను పట్టించడంలో సహాయం చేస్తాడు. అప్పుడు రాధాకృష్ణకు పోలీసులన్నా, పోలీస్‌ జాబ్‌ అన్నా ఉన్న ఆసక్తిని గమనించిన డిజిపి స్పెషల్‌ రిక్వెస్ట్‌తో రాధాకృష్ణను ఎస్‌.ఐను చేస్తాడు. వరంగల్‌లోని బర్సాలపల్లెకు ఆన్‌ డ్యూటీ వెళ్లిన రాధాకృష్ణ, అక్కడ ఇంజనీరింగ్‌ చదివే రాధ(లావణ్య త్రిపాఠి)ను చూసి ప్రేమిస్తాడు. రాధ కూడా రాధాకృష్ణను ప్రేమిస్తుంది. కానీ పల్లెటూళ్ళో కేసులేవీ ఉండకపోవడంతో మళ్ళీ తన పోస్టింగ్‌ను హైదరాబాద్‌కు మార్పించుకుంటాడు. కథ ఇలా సాగుతుండగా రాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ముఖ్యమంత్రి రేసులో సూరిరెడ్డి(ఆశిష్‌ విద్యార్థి), సుజాత(రవికిషన్‌) పోటీపడతారు. చివరకు సుజాతనే సీఎం అభ్యర్థిగా హై కమాండ్‌ నిర్ణయిస్తుంది. అదే సమయంలో సుజాతపై కొందరు బాంబ్‌ ఎటాక్‌ జరుగుతుంది. దానిలో కొంత మంది పోలీసులు కూడా చనిపోతారు. సుజాతనే తనపై ఎటాక్‌ చేయించుకుని ప్రజల్లో సానుభూతిని పొందుతాడు. కానీ పోలీసుల వైపల్యం కారణంగానే ఎటాక్‌ జరిగిందని ప్రచారం చేస్తాడు. అప్పుడు రాధ ఏం చేస్తాడు? పోలీసులపై పడిన మచ్చను ఎలా చేరిపేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్లస్‌ పాయింట్స్‌:

- శర్వానంద్‌ నటన
- సినిమాటోగ్రఫీ
- మ్యూజిక్‌
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌:

- రొటీన్‌ కథ
- స‌న్నివేశాలు వేరే సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి.

విశ్లేషణ:

పోలీసుల గొప్పతనాన్ని ఎలివేట్‌ చేసేలా సినిమా అంతా రన్‌ అవుతుంది. సమాజానికి పోలీసులు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నారు. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు వారి స్వార్ధానికి పోలీసులతో ఆటాడుకుంటున్నారు. అలా అడుకునేవారికి రాధ అనే పోలీస్ ఎలా బుద్ధి చెప్పాడ‌నేదే క‌థ‌. ఇందులో ముందుగా నటీనటుల పరంగా చూస్తే శర్వానంద్‌ మరోసారి ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించిన శర్వానంద్‌ చేసిన అవుటండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనరే ఈ చిత్రం. శర్వా పోలీస్‌ గెటప్‌లో కనపడ్డాడు.ఎప్పటిలాగానే పాత్రలో ఇమిడిపోయే ప్రయత్నం చేశాడు. తన స్టయిల్‌ ఆఫ్‌ కామెడిని పండించాడు. లావణ్య త్రిపాఠి, అక్ష ఇద్దరు గ్లామర్‌ డాల్స్‌గా మెప్పించారు. విలన్‌గా నటించిన రవికిషన్‌ పొలిటీషియన్‌ పాత్రలో మెప్పించాడు. గతంలో రవికిషన్‌ రేసుగుర్రం సినిమాలో కూడా ఇలాంటి పాత్రనే చేయడం వల్ల ఈ సినిమాలో పెద్దగా కష్టపడినట్టుగా అనిపించదు. చాలా సునాయసంగా చేసేశాడు. కోటశ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి, షకలక శంకర్‌, బ్రహ్మాజీ తదితరులు వారి వారి పాత్రలకు హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఫస్టాఫ్‌లో షకలక శంకర్‌ కామెడి పండించే ప్రయత్నం చేశాడు. ఇక బ్రహ్మాజీ పాత్ర సీరియస్‌గా సాగుతుంది. ఇక టెక్నిషియన్స్‌ పరంగా చూస్తే దర్శకుడు చంద్రమోహన్‌ కథలో కొత్తదనాన్ని చూపించలేదు. సినిమాలో ప్రతి సీన్‌ను ఏదో ఒక తెలుగు సినిమాను గుర్తుకు తెస్తుంది. ముఖ్యంగా హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ గబ్బర్‌సింగ్‌లో శృతిహాసన్‌ ఇంట్రడక్షన్‌ను పోలి ఉంటుంది. అలాగే విలన్‌ను హీరో బకరా చేసే సన్నివేశాలు, విలన్‌ను హీరో పగ తీర్చుకునే సన్నివేశాలు రేసుగుర్రంను తలపిస్తాయి. అలాగే క్లైమాక్స్‌ కూడా రేసుగుర్రం తరహాలోనే ఉంటుంది. కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్‌ను చక్కగా ప్రెజంట్‌ చేశాడు. రధన్‌ ట్యూన్స్ బావున్నాయి. ముఖ్యంగా లావ‌ణ్య‌, అక్ష‌ల‌పై వ‌చ్చే సాంగ్ తో పాటు ఖాకీ డ్రెస్‌పై వ‌చ్చే సాంగ్ కూడా బావుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆక‌ట్టుకుంది.  నిర్మాణ విలువలు బావున్నాయి. హీరోయిన్‌ను హీరో ఆటపట్టించే సన్నివేశాలు,  ఫస్టాఫ్‌లో హీరో పల్లెటూళ్ళో చేసే కామెడి బావుంది. హీరోకు సౌండ్‌ రీసివింగ్‌ పవర్‌ చాలా ఎక్కువగా ఉండటం అనేది. ఇది రేర్‌గా చాలా కొద్ది మందికి మాత్రమే ఉండే లక్షణం దాన్ని బేస్‌ చేసుకుని హీరో క్యారక్టరైజేషన్‌కు ఆపాదించాడు. మొత్తం మీద ఎంటర్‌టైనర్‌గా రొటీన్‌గా అనిపిస్తుంది.

బోటమ్‌ లైన్‌: 'రాధ' చెప్పిన శ్లోకం, సారాంశం కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

Radha English Version Review

Rating : 3.0 / 5.0