తిరుమలలో హిస్టరీ క్రియేట్ చేసిన రాహుల్

  • IndiaGlitz, [Friday,February 22 2019]

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమలలో అరుదైన రికార్డు సృష్టించారు. కేవలం ఒక గంట యాభై నిమిషాల్లోనే కాలినడకను కొండపై ఉన్న తిరుమల వెంకన్న చెంతకు చేరుకున్నారు. కాగా.. ఇంత తక్కువ సమయంలో తిరుమలకు చేరుకున్న మొదటి రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కాలినడకన మెట్ల మార్గంలో బయల్దేరి.. భక్తులతో కరచాలనం చేస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌తో కరచాలనం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా భక్తులు ఎగబడ్డారు. ఎలాంటి బ్రేకులు లేకుండా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏకధాటిగా రాహుల్ నడక సాగింది.

పంచకట్టులో రాహుల్...

తిరుమల వెంకన్న సన్నిధిలో రాహుల్ పంచకట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సాంప్రదాయ దుస్తుల్లోనే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్‌కు రాహుల్ చేరుకున్నారు. తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర ప్రారంభమైంది.

అనంతరం అదే స్టేడియంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. కాగా 2014 ఎన్నికల ముందు మోదీ ఎక్కడైతే ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇస్తానని ఆయన చెప్పారో.. అదే ప్రాంగణంలోనే కాంగ్రెస్‌‌కూడా సభ నిర్వహించింది. కాగా త్వరలో జరగనున్న ఎన్నికలు, ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ముఖ్యంగా అమరావతికి ఏమేం ఇస్తుందో ఈ సభావేదికగా రాహుల్ చెప్పనున్నారు.