Download App

Raja Vaaru Rani Gaaru Review

ప్రేమ‌క‌థా చిత్రాలంటే హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం.. ఇద్ద‌రూ విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌సుకోవ‌డ‌మ‌నే పాయింట్ మీద తెర‌కెక్కుతుంటుంది. కొన్నిసార్లు నెగ‌టివ్ క్లైమాక్స్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రేమ‌క‌థా చిత్రాల‌ను ఎంత కొత్త‌గా ప్రెజెంట్ చేశార‌నే దానిపైనే ప్రేమ క‌థా చిత్రాల విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌తి వారం ఏదో ఒక ప్రేమ క‌థ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంటుంది. అలా ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్రేమ‌క‌థా చిత్రం `రాజావారు రాణిగారు`. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ ప్రేమ‌క‌థ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం

క‌థ‌:

రామాపురం అనే ఊరిలోని రాజా(కిర‌ణ్ అబ్బవ‌రం) చిన్న‌ప్ప‌ట్నుంచి రాణి(ర‌హ‌స్య గోర‌క్‌)ని ఇష్ట‌ప‌డ‌తాడు. చిన్న‌ప్ప‌ట్నుంచి రాణి అంటే అంతులేని ప్రేమ‌ను పెంచుకున్న రాజా త‌న ప్రేమ‌ను ఆమెకు చెప్ప‌డానికి ప‌లుసార్లు ప్ర‌య‌త్నం చేసినా చెప్ప‌లేక‌పోతాడు. రాణి పై చ‌దువుల కోసం వేరే ఊరు వెళ్లిపోతుంది. మూడు సంవత్స‌రాలైనా ఆమె ఊరుకి తిరిగిరాదు. ఆమెను త‌లుచుకుంటూ రాజా ఉండిపోతాడు. చివ‌ర‌కు రాజా స్నేహితులు ఓ ప్లాన్ వేసి రాణీని ఊరికి ర‌ప్పిస్తారు. ఊరికి వ‌చ్చిన రాణీకి రాజా త‌న ప్రేమ‌ను చెబుతాడా?  లేదా?  రాజా ప్రేమ గెలిచిందా?  లేదా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, హీరోయిన్ ర‌హ‌స్య గోర‌క్ మ‌ధ్య‌నే సినిమా అంతా ర‌న్ అవుతుంది. సినిమాలో వీరిద్ద‌రూ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంది. ప్రేమ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. హీరో, హీరోయిన్లు కొత్త‌వారైన‌ప్ప‌టికీ చ‌క్క‌టి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. అలాగే హీరో, అత‌ని స్నేహితులుగా న‌టించిన చౌద‌రి, నాయుడు పాత్ర‌ధారుల మ‌ధ్య వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. చౌద‌రి, నాయుడు పాత్రలు మేన‌రిజ‌మ్స్ బాగానే ఉన్నాయి.

పాత్రల తీరు తెన్నులు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటాయి. సినిమా చూస్తున్నంత సేపు మ‌న ప‌ల్లెటూర్ల‌లోని  వ్య‌క్తుల‌ను చూస్తున్న‌ట్లు అనిపిస్తుంది. క‌థంతా ఓకే చుట్టూ తిర‌గ‌డం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. చివ‌ర‌గా ఓ ఎమోష‌న్‌తో సినిమాను పూర్తి చేశారు. ద‌ర్శ‌కుడు ర‌వికిర‌ణ్ కోలా క‌థ‌ను న‌డిపించిన తీరు అభినంద‌నీయం. క‌థ ఒకే చోట తిరిగిన‌ట్లు అనిపించ‌డం, కొన్ని సీన్స్‌లో లాజిక్ మిస్ అయ్యింది.

బోట‌మ్ లైన్‌: రాజావారు రాణిగారు.. అల‌రించే ప్రేమ‌క‌థా చిత్రం

Read Raja Vaaru Rani Gaaru Review in English Version

Rating : 2.5 / 5.0