మహాభారతం గురించి రాజమౌళి తాజా అప్‌డేట్ ఇది...

జక్కన్న.. ఈ పేరుకు అతికినట్టు సరిపోతారు డైరెక్టర్ రాజమౌళి. టాలీవుడ్ చిత్ర శిల్పిగా పేరుతెచ్చుకున్న ఆయన సినిమా తీశారంటే.. శిల్పం చెక్కినట్టు అద్భుతంగా.. సినీ ప్రపంచం తనవైపు చూసేలా తెరకెక్కిస్తారు. స్టూడెంట్ నం. 1 నుంచి బాహుబలి వరకు ఆయనది ఇదే శైలి. పాత్రల మధ్య భావోద్వేగాలు పండించడంలోనూ, ఫైట్స్, సెట్టింగ్స్ .. పాత్రల చిత్రీకరణ, పాటలు ఇలా ప్రతీ దానిలో.. ఆయనలోని శిల్పి కళ్లముందు కదలాడతాడు. అందుకేనేమో.. జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ను జక్కన్న అని పిలుస్తుంటారు. ఇలాంటి దర్శకుడు మహా భారతం రూపొందిస్తే ఎలా ఉంటుంది? మాయాబజార్, శ్రీకృష్ణపాండవీయం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలు చూసి మహాభారత కథపై కాస్తో, కూస్తో అవగాహన పెంచుకుంటున్న నేటి తరానికి .. విజువల్ ఫీస్ట్ అందించగల ఏకైక దర్శకుడు జక్కన్న మాత్రమేననేది సినీ అభిమానుల మాట. ఆ కథకు వెండితెరపై న్యాయం చేయగల దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహాభారతంపై తన మనసులో మాట బయటపెట్టారు.

‘మత్తు వదలరా’ సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకున్న కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి బృందంతో రాజమౌళి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆ బృందం మహాభారతం సినిమా గురించి ఆయన్ను ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెబుతూ... ఈ సినిమా కచ్చితంగా చేస్తానని.. సినిమా తీస్తే మొత్తం తానే తీస్తానని తెలిపారు. అంత పెద్ద కథను ఎలా మలుచుకోవాలో తనకు తెలుసునని.. దానికి తగ్గట్టే కథ రాసుకుంటానన్నారు. ఒత్తిడితో సినిమాలు చేయలేమని.. దాన్ని దూరం పెట్టినప్పుడే జయించగలమన్నారు. తానెప్పుడూ అలాగే పని చేస్తుంటానని.. అందుకే స్వేచ్ఛగా పని చేయగలుగుతుంటానని అన్నారు.