close
Choose your channels

గ‌రుడ వేగ అంకుశం క‌న్నా పెద్ద హిట్ : స‌క్సెస్ మీట్ లో రాజ‌శేఖ‌ర్

Tuesday, November 7, 2017 • తెలుగు Comments

రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై తెర‌కెక్కిన 'పీఎస్‌వీ గ‌రుడ వేగ 123.18ఎం' శుక్ర‌వారం విడుద‌లై విజ‌యందిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా హీరో రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, "ఏ మూహుర్తాన ప్ర‌వీణ్ స‌త్తారు ఈ క‌థ చెప్పాడో గానీ...సినిమా స‌క్సెస్ క‌థే కార‌ణ‌మైంది. నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్ర‌మిది. ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం 'అకుశం' అని చెప్పాను. కానీ గ‌రుడ‌వేగ అంత‌క‌న్నా భారీ విజయాన్ని న‌మోదు చేసింది. సినిమా కోసం నా జీవిత ఎంతో క‌ష్ట‌ప‌డింది. రాజ‌శేఖ‌ర్ స‌రైన స‌క్సెస్ లేద‌ని లోలోప‌ల ఎంతో కుమిలిపోయింది. ఎలాగైనా స‌క్సెస్ ఇవ్వాల‌ని సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. అలాగే ప్ర‌వీణ్ సినిమా కోసం ప‌డిన క‌ష్టం అనీర్వ‌చ‌నీయం. వాళ్లిద్ద‌రి కష్టానికి ఈరోజు ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇక సినిమా రిలీజ్ టైమ్ లో అన్నీ ప్ర‌తికూల ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి. ముర‌ళీ చ‌నిపోయ‌వ‌డం..చెన్నై లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ నా సినిమా పోతుంద‌ని ఒక‌వైపు నా మ‌న‌సు చెప్పినా... మంచి సినిమా క‌ష్ట‌ప‌డి చేశాం త‌ప్పుకుడా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మ‌రో వైపు అనిపించేది. దానంత‌టికీ కార‌ణం ప్ర‌జ‌లే. వాళ్లు నా సినిమాను ఎంత‌గానో ఆద‌రించారు కాబ‌ట్టి స‌క్సెస్ అందుకున్నా.  ఇంత స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కులందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు" అని అన్నారు.

జీవిత మాట్లాడుతూ, " ఓ కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న మాట త‌ప్ప‌. ప్ర‌వీణ్-రాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ అంటే పెద్ద‌గా అంచ‌నాలేవి లేవు. కానీ వాట‌న్నింటిని ప్ర‌జ‌లు మాకు స‌క్సెస్ తో అందించారు. టీమంతా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ప్ర‌వీణ్ నా వెనుక ఉండి ఎంతో స‌హ‌కారాన్ని అందించారు.  అలాగే సినిమా ప్ర‌మోష‌న్ టైమ్ లో బాల‌కృష్ణ గారు, చిరంజీవిగారు, రానా, తాప్సీ, మంచు ల‌క్ష్మి, కాజ‌ల్ చాలా స‌హ‌కారం అందించారు. వాళ్ల వ‌ల్ల సినిమా ప్రేక్ష‌కులు మ‌రింత ద‌గ్గ‌రైంది. రిలీజ్ అనంత‌రం చిరంజీవిగారు సినిమా చూసి మెచ్చుకున్నారు" అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మాట్లాడుతూ, " ప్రారంభ స‌మ‌యంలో సినిమా గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. వాట‌న్నింటికి సినిమా స‌క్సెస్ స‌మాధ‌నం చెప్పింది. మంచి కాన్సెప్ట్ లు ఎప్పుడూ విజయం సాధిస్తాయ‌ని మాకిచిత్రం ద్వారా మ‌రోసారి తెలిసింది. క‌థ ముఖ్యంగానీ..ఆ క‌థ‌కు ఎంత ఖ‌ర్చు చేస్తున్నామ‌న్న‌ది ముఖ్యం కాదు. టెక్నిక‌ల్ గా మంచి టీమ్ దొరికింది. నాకు ద‌క్కుతోన్న క్రెడిట్ అంతా నా టీమ్ కు అంకితం చేస్తున్నా. ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కులంద‌రికీ కృతజ్ఞ‌త‌లు" అని అన్నారు.

హీరోయిన్ పూజా కుమార్ మాట్లాడుతూ," ప్ర‌వీణ్ అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో సినిమా చేశారు. తెలుగులో డిఫ‌రెంట్ ఎటెంప్ట్ స‌క్సెస్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇంత‌టి మంచి సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు" అని అన్నారు.

మ‌రో హీరోయిన్ శ్ర‌ద్ధా దాస్ మాట్లాడుతూ, "ప్ర‌వీణ్ గారితో రెండ‌వ సారి క‌లిసి ప‌నిచేశా. ఆయ‌న మంచి టెక్నీషియ‌న్. పాత్ర చిన్న‌దైనా చాలా సంతృప్తినిచ్చిన సినిమా చేశాను" అని అన్నారు. ఈ వేడుక‌లో గ‌రుడవ‌గే యూనిట్ స‌భ్యులంతా పాల్గున్నారు.