ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నాం: రాజీవ్ శుక్లా

  • IndiaGlitz, [Tuesday,May 04 2021]

ఐపీఎల్‌-14వ సీజన్‌ను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. దీంతో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం నిజానికి ఈ నెల 8 వరకు అక్కడ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌నే వాయిదా వేయాల్సి వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తితో పాటు పేసర్‌ సందీప్‌ వారియర్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం స్థానిక నరేంద్ర మోదీ మైదానంలో కేకేఆర్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రకటించి రెండు రోజులు కూడా గడవకముందే మొత్తం ఐపీఎల్ మ్యాచ్‌నే వాయిదా చేస్తున్నట్టు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

Also Read: బిల్‌గేట్స్ దంపతుల షాకింగ్ నిర్ణయం.. విడిపోతున్నామంటూ ప్రకటన

ఈ భూమ్మీద అత్యంత రక్షణాత్మక వ్యవస్థ అంటూ ఐపీఎల్‌ బయో బబుల్‌ గురించి బీసీసీఐ ఘనంగా చెప్పుకొంటుంది. ఏడు రోజుల క్వారంటైన్‌.. మూడు సార్లు కరోనా నెగెటివ్‌ ఫలితం తర్వాతే ఆటగాళ్లు, స్టాఫ్‌, కుటుంబసభ్యులకు ఇందులో ప్రవేశం ఉంటుంది. అలాంటిది బయో బబుల్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటం అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. కాగా.. భుజం నొప్పితో బాధపడుతున్న వరుణ్ స్కానింగ్ కోసం అధికారిక గ్రీన్ ఛానెల్ ద్వారా పూర్తి జాగ్రత్తలు తీసుకుని బబుల్‌ను వీడి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే వరుణ్‌కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. వరుణ్ ద్వారా సందీప్‌కు కరోనా సోకింది. అలాగే.. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వెంటనే వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. కోల్‌కతా టీమ్‌లో పాజిటివ్‌ వ్యవహారం బయటపడిన కొన్ని గంటల్లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌లోనూ మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

ఇందులో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్‌, జట్టు ప్రయాణించే బస్సు క్లీనర్‌ ఉన్నారు. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో వీరికి పాజిటివ్‌గా వచ్చింది. అయితే సోమవారం ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో మాత్రం నెగెటివ్‌ అని తేలడంతో తొలి ఫలితాన్ని తప్పని, ఆ జట్టులో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని బీసీసీఐ ప్రకటించింది. కేకేఆర్‌, చెన్నై జట్టులో వెలుగుచూసిన కేసులు బీసీసీఐని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు ఇప్పటికే బబుల్‌లో ఉండలేక జంపా, రిచర్డ్‌సన్‌, టై, లివింగ్‌స్టోన్‌ స్వదేశాలకు వెళ్లిపోయారు. అశ్విన్‌, అంపైర్‌ నితిన్‌ మీనన్‌ కుటుంబాల్లో కరోనా కారణంగా అర్ధంతరంగా ఐపీఎల్‌ వీడాడు. మ్యాచ్‌ రెఫరీ మను నాయర్‌ కూడా స్వస్థలానికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సహజంగానైతే ధీమాగా కనిపించే బోర్డు అధికారులు ఈసారి మాత్రం లీగ్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశారు. పరిస్థితి క్లిష్టంగా తయారవడంతో ఇక చేసేదేమీ లేక ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.