close
Choose your channels

ఫ్యాన్స్.. పవన్ చెప్పిందే నిజమని నమ్మితే..: రవితేజ

Saturday, December 14, 2019 • తెలుగు Comments

ఫ్యాన్స్.. పవన్ చెప్పిందే నిజమని నమ్మితే..: రవితేజ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఊహించని రీతిలో భారీ షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. పవన్‌ అత్యంత సన్నిహితుడు.. పవన్ కు రైట్ హ్యాండ్ అనే రీతిలో పార్టీ వర్గాల్లో రాజు రవితేజకు గుర్తింపు ఉంది. జనసేన పార్టీ పెట్టడానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి రాజు రవితేజ్‌ పార్టీకీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా.. మీడియా వేదికగా జనసేన.. ఆ పార్టీ అధినేత తీరుతెన్నులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో తన వ్యాఖ్యలతో హీట్ పుట్టించిన రవితేజ తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తనపై ప్రభావం చూపించే వ్యక్తులను పార్టీ నుంచి పవనే బైటికి నెట్టేస్తారని, పార్టీలో అన్ని వ్యవహారాలు తన గుప్పిట్లో ఉండాలని ప్రయత్నిస్తారని ఆయన ఆరోపించారు.

అన్నీ పవనే.. మా సంగతేంటి!?

‘జనసేన పార్టీలో కెప్టెన్ ఆయనే.. ఆయనే బ్యాట్స్ మన్.. ఆయనే బౌలర్.. ఆయనే ఫీల్డర్.. చివరికి ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. అయితే.. ఎవరైనా బాగా ఆడుతుంటే వాళ్లను కావాలనే రనౌట్ చేసే వ్యక్తి పవన్. జనసేన పార్టీని చాలామంది వీడడానికి కారణమిదే. నాకు తెలిసినంతవరకు పవన్‌కు కులం, మతంపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులం, మతాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న తీరే చాలా ప్రమాదకరం’ అని రవితేజ వ్యాఖ్యానించారు.

బీజేపీకి దగ్గర కావాలని..!

‘పవన్ ఇటీవల బీజేపీ, మోదీ, అమిత్ షా అనుకూల వ్యాఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీకి దగ్గరకావాలని పవన్ సంకేతాలు ఇస్తున్నారు. కానీ రైట్ సైడ్ చూపించి లెఫ్ట్ సైడ్ వెళతారా? స్ట్రెయిట్‌గా వెళతారా? ఎవరికీ తెలియదు. ప్రజలకు సేవలందించాల్సిన పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత వివాదాలను మాట్లాడి పార్టీలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన కోపం, ద్వేషంతో పవన్ చేసిన ప్రసంగాల కారణంగా నిజమైన మద్దతుదారులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇతర పార్టీల వారికంటే సొంత పార్టీ వాళ్లే పవన్‌ను ఎక్కువగా ద్వేషిస్తుంటారు. పవన్ వైఖరిని ఈ మధ్య బాగా గమనిస్తే.. సమస్య లేని చోట సమస్యను సృష్టించే విధంగా తయారయ్యాడు. కులం పేరిట పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అమాయకులైన అభిమానుల్లో తప్పుడు బీజాలు నాటుతున్నాయి. పవన్ చెప్పిందే నిజమని అభిమానులు నమ్మితే జరిగే పరిణామాలకు బాధ్యులెవరు..?’ అని ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర స్థాయిలో రవితేజ ధ్వజమెత్తారు. కాగా.. పవన్ కల్యాణ్ సమాజానికి ప్రమాదకరమని చెబుతూ.. ఆయనలో విషపూరిత ఆలోచనలు, ప్రతీకార ధోరణి బలంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి నాయకుడ్ని అధికారం చేపట్టకుండా ఆపాలని రాజు రవితేజ పిలుపునిచ్చిన విషయం విదితమే.

Get Breaking News Alerts From IndiaGlitz