close
Choose your channels

టీవీ9 వివాదం పై రవిప్రకాష్ సంచలన వీడియో విడుదల

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ9 వివాదంలో రవిప్రకాష్‌కు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసు బృందాలు ఆయనకోసం గాలిస్తున్నారు. ఇటీవల ఆయన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఈ-మెయిల్స్ పంపడంతో ఐపీ అడ్రస్ ఆధారంగా రవిప్రకాష్, నటుడు శివాజీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ క్రమంలో నటుడు శివాజీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

తనకు వడదెబ్బ తగిలిందని.. తానెక్కడికీ పారిపోలేదని మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలే అని ఖండించారు. అయితే తాజాగా.. రవిప్రకాష్ కూడా ఓ వీడియో విడుదల చేసి అసలు టీవీ9లో వివాదం ఎలా మొదలైంది..? అసలు ఈ వివాదానికి కారకులెవరు..? ఈ వివాదం వెనుక ఉన్నవారెవరు..? రవిప్రకాష్, శివాజీలపై ఉన్న కేసులేంటి..? టీవీ9 షేర్స్ కొన్న మై హోమ్ రామేశ్వరావు పరిస్థితేంటి..? ఇలా పలు విషయాలు రవిప్రకాష్ తన వీడియోలో చెప్పుకొచ్చారు.

రామేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు...

"నన్ను ఓ జీతగాడిలా, పాలేరులా పని చేయమన్నారు. టీవీ9 కోసం ఎంతో కష్టపడి దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ చేశాం. అలాంటి నన్ను చట్టరిత్యా ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వ్యాపారవేత్త శ్రీనిరాజు మద్దతు, ఆర్థిక ప్రోత్సాహంతో టీవీ9 దేశంలో నెంబర్ వన్ ఛానల్‌గా నిలిచింది. శ్రీనిరాజు బయటకు వెళ్తాననడంతో.. లాభం గురించి ఆలోచించకుండా స్టేక్ హోల్డర్ల కోసం చాలా మంది దగ్గరకు నేను వెళ్లాను. ఆ సమయంలో మెగా కృష్ణారెడ్డి.. స్నేహితులతో కలిసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. నలుగురు కలిసి ఒక్కొక్కరు 20శాతం స్టేక్ హోల్డర్లుగా ఉంటానన్నారు. చీఫ్ ఎడిటర్‌గా పూర్తి స్వేచ్ఛ నాకు ఇస్తామన్నారు. అలాగే పని చేయడానికి సిద్ధపడ్డాను. కానీ.. మెగా కృష్ణారెడ్డి వెళ్లిపోయి.. రామేశ్వర రావు వచ్చి చేరారు. దీనిపై మెగా కృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లి ఇదేంటి మాట తప్పారని ప్రశ్నించాను. ఇదే విషయమై రామేశ్వర రావు దగ్గరకు వెళ్లి.. నేను మైనార్టీ స్టేక్ హోల్డర్‌ను.. చాలా కష్టపడ్డాను. చట్టరిత్యా ఇద్దరి మధ్యా ఒప్పందం ఉండాలని చెప్పాను. నాది కుటుంబ వ్యాపారం.. స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. రాతపూర్వక ఒప్పందాలు ఉండవు. పాలేరులా, జీతగాడిలా పని చేయాలి. లేదంటే ఎటువంటి ఇబ్బందులకైనా గురి చేస్తానని చెప్పారు. నీకున్న షేర్, చాలా తక్కువన్నారు" అని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

మూడు కేసులపై...

"ఇక నాపై కొత్త యాజమాన్యం పెట్టిన మూడు కేసుల గురించి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నాపై కేసులు పెట్టి తీవ్రవాదిలా చూస్తున్నారు. ఎయిర్ పోర్టులు, షిప్ యార్డుల దగ్గర కాపలా పెడుతున్నారు. మూడింటిలో మొదటిది రవిప్రకాశ్, శివాజీల మధ్య ఒప్పందంపై రామేశ్వర రావు బంధువు వచ్చి కేసు పెట్టడం. ఎన్సీఆర్టీ కోర్టులో ఉన్న పత్రాలు ఉండగా.. వాటిపై కేసు పెట్టడం ఎంత వరకు సమంజసం. ఇది చాలా హాస్యాస్పదం. ఇక మాదగ్గర పని చేసిన తాత్కాలిక ఉద్యోగి దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. రాజీనామా పత్రాన్ని అప్ లోడ్ చేశారని చెప్పడం. దేవేందర్‌ను.. కిడ్నాప్ చేసి ఆ రోజు రాత్రంతా బందీగా ఉంచి.. డైరెక్టర్ల పేర్లను అప్‌లోడ్ చేయాలని చూశారు. కానీ వాళ్ల ప్లాన్ కుదరలేదు. దీంతో నాపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టేలా చేశారు. దేవేందర్ అగర్వాల్ అనే తాత్కాలిక ఉద్యోగి సంతకాన్ని నేను ఫోర్జరీ చేశారని చెప్పడం హాస్యాస్పదం" అని రవిప్రకాష్ తనపై పెట్టిన కేసుల గురించి చెప్పుకొచ్చారు.

టీవీ9 లోగో వివాదంపై...

"టీవీ9 లోగో ఆథర్ నేనే.. లోను సృష్టించింది రవిప్రకాష్.. టీవీ9 లోగో యజమాని రవిప్రకాష్. ఈ విషయాన్ని పక్కనపెట్టి లోగోను ఉపయోగించడానికి రాయల్టీని రవిప్రకాష్‌కు చెల్లించాల్సి ఉంది. ఈ రాయల్టీని చెల్లించకుండా ఎగ్గొట్టడానికి మీరు టీవీ9 లోగోను తీసుకొని పారిపోతున్నాడని.. ఆ లోగోను మాయం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తుండటం ఇది మరింత హాస్యాస్పదం. ఆ లోగోకు యజమాని ఎవరు..? అనేది సంస్థను కొనేముందు తెలుసుకోవాల్సి ఉంది. అన్ని విషయాలు తెలిసిన తర్వాత సంస్థ కొత్త యాజమాన్యం కొనుంటే బాగుండేది. కానీ అవన్నీ ఏమీ తెలుసుకోకుండా సంస్థను కొన్నారు" అని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

కాగా.. టీవీ9 లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారని రవిప్రకాష్ అభియోగం వచ్చిన విషయం విదితమే. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ కౌశిక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పోలీసులు.. మై హోమ్ సంస్థ ఉద్యోగుల్లా!

"టీవీ9 మొత్తం వివాదంలో పోలీసులు.. మైహోమ్ గ్రూపు సంస్థ ఉద్యోగుల్లా పని చేస్తున్నారు. విలువలను పాటించాలా..? ఆ విలువల కోసం ధనికస్వాములకు భయపడి... పూర్తిగా వారికి ఊడిగం చేయాలా అన్న ఆలోచన. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలి. ధనికస్వాములకు, ప్రజాస్వామ్యం ... నేను ఒక ముందడుగు వేస్తున్నాను. నేను నమ్మిన అడుగువేస్తున్నాను. మీ మద్దతు తప్పకుండా దొరకుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్" అని రవిప్రకాష్ స్పష్టం చేశారు.

కాగా.. తానేం తప్పు చేయలేదని రవిప్రకాష్ చెబుతున్నాడు సరే.. పోలీసులు ముందు హాజరుకావడానికి ఎందుకు భయపడుతున్నారు..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఈ వివాదానికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో..? రవిప్రకాష్ ఎప్పుడు బయటికొస్తాడో..? శివాజీ ఎప్పుడు బయటికొస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.