close
Choose your channels

కరోనాపై ‘RRR’ హీరోల యుద్ధం.. ఈ ఆరు సూత్రాలు చాలు

Tuesday, March 17, 2020 • తెలుగు Comments

కరోనాపై ‘RRR’ హీరోల యుద్ధం.. ఈ ఆరు సూత్రాలు చాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కూ పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ కోవిడ్-19 వైరస్ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చనిపోవడంతో.. ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు జంకుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ ఈ కరోనా విస్తరిస్తుండటం.. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మొదలుకుని.. థియేటర్స్ వరకూ అన్నీ బంద్ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.

అయితే.. దీనిపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు. ఏ సమాచారమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే దానికి బలమైన మాధ్యమం కూడా ఉండాలన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలను సినీతారలు చెబితే ప్రజల్లోకి త్వరగా వెళ్తాయి. అందుకే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రభుత్వమే ఓ వీడియో చేయించింది. మరోవైపు టాలీవుడ్ నటీనటులు కూడా తమ వంతుగా అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా కోవిడ్-19పై యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి అలియాస్ జక్కన్న సోషల్ మీడియాలో కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అయితే తాజాగా ఆ సినిమా హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి.. 01:20 నిమిషాల నిడివి గల ఓ వీడియోను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన ఈ ఆరు సూత్రాలను పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలమని ఆ వీడియోలో ఇద్దరూ నిశితంగా వివరించారు.

హీరోలు చెప్పిన చిట్కాలివే..

1:- చేతులను సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్ల సందుల్లోను కూడా. బయటికి వెళ్లొచ్చినప్పుడు, భోజనం చేయడానికి ముందు.. ఇలా కనీసం రోజుకి ఏడెనిమిది సార్లు చేయాలి.
2:- కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు తెలిసినవాళ్లు ఎదురుపడితే.. కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి.
3:- మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్ 19 వైరస్ మీకు అంటుకునే ప్రమాదం ఉంది.
4:- ఇంకో ముఖ్యమైన విషయం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతులు కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోవాలి.
5:- జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్లకండి.
6:- మంచి నీళ్లు ఎక్కువగా తాగండి. గడగడ అని తొందరగా తాగేకన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది.

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మకండి..

మరీ ముఖ్యంగా.. వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజం ఎంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దామని.. మనల్ని మనమే రక్షించుకుందామని ఆ ఇద్దరు హీరోలు చెప్పారు. ఆఖరుగా.. పరిశుభ్రత పాటించండని ఎన్టీఆర్ చెప్పగా.. ‘స్టే సేఫ్’ చెర్రీ చెబుతూ వీడియోను ముగించారు. మొత్తానికి చూస్తే కరోనాపై ఆర్ఆర్ఆర్ టీమ్ గట్టిగానే యుద్ధం చేస్తోంది. మరి ఈ యంగ్ హీరోలు చెప్పిన విషయాన్ని అభిమానులు, సినీ ప్రియులు ఏ మాత్రం పాటిస్తారో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz