తెలంగాణలో మళ్లీ బలిదానాలు మొదలు.. ఆర్టీసీ డ్రైవర్ మృతి

  • IndiaGlitz, [Sunday,October 13 2019]

తెలంగాణ సర్కార్‌లో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో శనివారం నాడు ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతికి యత్నించిన విషయం విదితమే. అయితే నిన్నట్నుంచి అపోలో ఆస్పత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నిన్న కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆయన ఆత్మాహుతికి యత్నించడంతో ఆయన శరీరం సుమారు 90 శాతం కాలిపోయింది. దీంతో వైద్యానికి శ్రీనివాసరెడ్డి శరీరం సహకరించకపోవడంతో ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారన్న వార్తతో ఆర్టీసీ ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. శ్రీనివాస్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే శ్రీనివాస్ మృతితో మళ్లీ తెలంగాణలో బలిదానాలు మొదలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇవి ఎక్కడిదాకా వెళ్తాయో..? ఎప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుందో వేచి చూడాలి మరి.

పరిస్థితి ఉద్రిక్తం..!

ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ మృతితో కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఆస్పత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగి.. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్ట్ చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో శ్రీనివాసరెడ్డిని కాపాడబోయి అతని కుమారుడు సురేశ్ కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే. జీతాలు ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించడంతోనే శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాలు ఎటాక్!

ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ మృతితో మరోసారి ప్రతిపక్షాలు.. అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ‘నా చావుకు కారణం ప్రభుత్వమే కారణమని శ్రీనివాసరెడ్డి వాంగ్మూలమిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. పీఎఫ్‌ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలని శ్రీనివాసరెడ్డి మరణవాంగ్మూలం’ ఉందని తమ్మినేని వీరభధ్రంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీనివాస్ మృతితో అయినా కేసీఆర్‌ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

బద్నాం చేసేందుకే..!

కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపడుతున్నారని.. ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఓ నాయకుడు ఆడుతున్న డ్రామా అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ విలీనం హామీ ఎక్కడా ఇవ్వలేదని.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడా బస్సుల కొరత లేదని.. కార్మికుల జీవితాలతో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు ఆటలాడుతున్నారని.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల మద్దతు లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.