బ్రేకింగ్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్య నాదెళ్ల.. శిఖరాగ్రాన తెలుగు తేజం!

  • IndiaGlitz, [Thursday,June 17 2021]

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల 2014లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెసిందే. మైక్రో సాఫ్ట్ సంస్థలో అత్యంత కీలక పదవిని పొందిన సత్య నాదెళ్ల తెలుగువారందరికీ గర్వకారణం అయ్యాడు. తాజాగా సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ప్రపంచం మొత్తం ఇప్పుడిదే హాట్ టాపిక్.

తెలుగు తేజం సత్య నాదెళ్ల ఈ ఘనత సాధించడంతో సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఛైర్మన్ గా ఉన్న జాన్ థాంసన్ స్థానంలో సత్య నాదెళ్లని ఛైర్మన్ గా కంపెనీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. 2014నుంచి నాదెళ్ల సీఈఓ గా మైక్రోసాఫ్ట్ ని విజయపథంలో నడిపిస్తున్నారు.

జాన్ థాంసన్ ఛైర్మన్ గా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత భాద్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆ స్థానంలోకి నాదెళ్ల రావడంతో థాంసన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

నాదెళ్ల సీఈఓ గా భాద్యతలు చేపట్టాక అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. లింక్డ్ ఇన్, జెనీమాక్స్, న్యూయార్క్ కమ్యూనికేషన్స్ లాంటి అత్యధిక వ్యయాలతో కూడిన కొనుగోళ్లు చేశారు. దీనితో చైర్మన్ పదవికి నాదెళ్ల 100 శాతం అర్హుడు అని కంపెనీ విశ్వసించింది.

ఇదిలా ఉండగా ఇటీవల బిల్ గేట్స్ వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బిల్ గేట్స్ తన భార్యతో విడిపోయారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగితో ఎఫైర్ అంటూ గేట్స్ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ దర్యాప్తు కూడా చేసింది. అయితే గేట్స్ ని బోర్డు నుంచి తొలగిస్తారు అంటూ ఉహాగానాలు కూడా వినిపించాయి. కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు.