కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

  • IndiaGlitz, [Sunday,October 31 2021]

సీనియర్‌ నటుడు, కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు హైదరాబాద్‌లోని తన ఇంట్లో జారి పడ్డారు. దీంతో కైకాలను శనివారం రాత్రి కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత వయోభారం కారణంగా సత్యనారాయణ సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. వందలాది సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఏ పాత్రలోనైనా నటించగల అద్బుతమైన నటుల్లో సత్యనారాయణ ఒకరు. అందుకే ఆయనను అభిమానులు ‘‘నవరస నటనా సార్వభౌమ ’’గా పిలుచుకుంటూ వుంటారు.