సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం వాణిశ్రీకి పుత్రశోకం కలిగింది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ చెన్నైలోని తన ఇంట్లో చనిపోయారు. నిద్రలో ఉండగానే ఆయన గుండెపోటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొదట ఇలా వార్తలు వినిపించినప్పటికీ ఆయన తన ఇంట్లోని బాత్రూమ్‌లో ఉరేసుకున్నారని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో అనేది క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు కూడా ఇందుకు సంబంధించి మీడియాకు ఎలాంటి విషయాలు చెప్పలేదు. కాగా.. అభినయ్ మరణంతో వాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అభినయ్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. అభినయ్ ఇకలేడని తెలుసుకున్న మిత్రులు, ఆప్తులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే.. వాణిశ్రీకి ఒక కుమార్తె.. ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. కాగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఎవరీ వాణిశ్రీ..!?

కాగా.. సీనియర్ నటి అయిన వాణిశ్రీ స్వస్థలం నెల్లూరు జిల్లా. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ‘మరపురాని కథ’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సుఖ దు:ఖాలు’ సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాల్లో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగంలో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకూ వాణిశ్రీనే అగ్రతారగానే ఉన్నారు.

అలా అప్పట్లో.. స్టార్ హీరోలు, సీనియర్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న ఈమె కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత సినీ రంగము నుంచి బయటికొచ్చి పెళ్ళి చేసుకొని సంసార జీవితంలో స్థిరపడ్డారు. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు.