Download App

Shamantakamani Review

భ‌లే మంచి రోజు వంటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య త‌దుప‌రి ఏకంగా నలుగురు హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడ‌న‌గానే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అంతా ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమా `శ‌మంత‌క‌మ‌ణి`. ఎందుకంటే టాలీవుడ్‌లో సాధార‌ణంగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు రావ‌డ‌మే అరుదుగా మారింది. ఈమ‌ధ్య ఇద్ద‌రు హీరోలు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్స్‌కు శ్రీకారం చుట్టారు. అలాంటిది ఏకంగా న‌లుగురు హీరోల‌ను ఒప్పించి సినిమా చేయ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు. మ‌రి ద‌ర్శ‌కుడు `శ‌మంత‌క‌మ‌ణి` అనే పేరున్న కారుతో ఈ సినిమాలో ఏం చెప్పాడు. అస‌లు న‌లుగురు హీరోల పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా హ్యాండిల్ చేశాడా అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

క‌థ ప్ర‌ధానంగా ఓ కారు..ఐదుగురు వ్య‌క్తుల చుట్టూ తిరుగుతుంది. క‌థ‌లోకి వెళితే..స‌ర్కిల్ ఇన్సెపెక్ట‌ర్ రంజిత్‌(నారారోహిత్‌) లంచ‌గొండి పోలీస్ ఆఫీస‌ర్‌. హైద‌రాబాద్‌లో పెద్ద హోటల్‌లో ఐదు కోట్ల విలువ‌గ‌ల కారు పోయింద‌ని త‌న వ‌ద్ద‌కు కంప్లైంట్ వ‌స్తుంది. క‌మీష‌న‌ర్ ఆర్డ‌ర్‌తో ప‌ర్స‌న‌ల్ కేసును రంజిత్ డీల్ చేయ‌డం ప్రారంభిస్తాడు. కారు ఓన‌ర్ కొడుకు కృష్ణ‌(సుధీర్‌బాబు) త‌న స్నేహితుల‌కు బ‌ర్త్‌డే పార్టీ ఇవ్వ‌డానికి హోట‌ల్‌కు తీసుకెళ్లిన కారు శ‌మంత‌క‌మ‌ణి క‌న‌ప‌డ‌కుండా పోతుంది. కారు విలువు ఐదు కోట్లు. హోట‌ల్‌లో జ‌రిగిన పార్టీలో కారు పోతుంది. రంజిత్ సిసి టీవీ ఫుటేజ్ చూసి కోటిప‌ల్లిశివ‌(సందీప్‌కిష‌న్‌), ఇంజ‌నీరింగ్ స్టూడెంట్ కార్తీక్‌(ఆది) స‌హా మెకానిక్ ఉమామ‌హేశ్వ‌ర‌రావు(రాజేంద్ర‌ప్ర‌సాద్‌)ల‌ను ఆరెస్ట్ చేస్తాడు. అంద‌రూ వారు పార్టీలో ఏం చేశారో చెబుతారు. ఎవ‌రిపైనా సందేహం కూడా రాదు. ఇంత‌కు ఆ కారు కొట్టేసిందెవ‌రు? అస‌లు కోటిప‌ల్లి శివ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని అత‌ని ల‌వ‌ర్ అత‌న్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే కార్తీక్ ల‌వ‌ర్, అత‌ని చేసే ప‌నులు చూసి కోప్ప‌డుతుంది. మ‌రి వీరంద‌రికీ, శ‌మంత‌క‌మ‌ణి కారుకు ఉన్న రిలేష‌న్ ఏంటి?  చివ‌రికి కారు దొరికిందా? అనే విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

న‌టీన‌టులు ప‌నితీరు:

ఇందులో ప్ర‌ధానంగా ఐదు పాత్ర‌లు వాటి చుట్టు అల్లిన మిగిలిన పాత్ర‌లు క‌న‌ప‌డ‌తాయి. నారా రోహిత్..ఇప్ప‌టి వ‌ర‌కు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ్డ నారా రోహిత్‌, ఈసారి లంచ‌గొండి పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ్డాడు. పాత్ర‌లో పెద్ద‌గా కష్ట‌ప‌డేంత లేదు కాబ‌ట్టి సునాయ‌సంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక సుధీర్‌బాబు డ‌బ్బున్న యువ‌కుడు. తండ్రి ప్రేమ చూపించ‌డు. త‌ల్లి చ‌నిపోవ‌డంతో, అమ్మ ప్రేమ కోసం అల‌మ‌టిస్తుంటాడు. పాత్ర ప‌రంగా రిచ్ లుక్‌లో సుధీర్ చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో అమ్మ ప్రేమ గురించి చెప్పే స‌న్నివేశంలో సుధీర్ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక కోటిప‌ల్లి శివ పాత్ర‌లో సందీప్‌కిష‌న్‌, ఇంజ‌నీరింగ్ స్టూడెంట్ కార్తీక్‌గా ఆది పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇక ఉమామ‌హేశ్వ‌ర‌రావు అలియాస్ మ‌హేష్ పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఇంద్ర‌జ ప్రేమ కోసం ఏం చేస్తాడనేది క‌థ‌. ఇక త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, అదుర్స్ ర‌ఘు, సుమ‌న్, చాందిని చౌద‌రి, జెన్ని అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు.

టెక్నిషియ‌న్స ప‌నితీరు:

కేవ‌లం ఓ సినిమా అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌ను న‌మ్మి న‌లుగురు హీరోలు సినిమా చేయ‌డానికి ఒప్పుకోవ‌డం అంటే గొప్ప విష‌య‌మే. అందుకు ప్ర‌ధాన కార‌ణం క‌థ‌, మంచి స్క్రీన్‌ప్లే అని చెప్పాలి. దాదాపు ఐదు క్యారెక్ట‌ర్స్ చుట్టూ క‌థ‌ను న‌డ‌ప‌డం అంటే చిన్న విష‌యం కాదు. అయితే ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌ను ముందుగా అభినందించాలి. ఎందుకంటే న‌లుగురు హీరోల పాత్ర‌ల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు. ఎక్క‌డా కన్‌ఫ్యూజ‌న్ లేకుండా సినిమాను ముందుకు తీసుకెళ్ళడం గొప్ప విష‌యం. కామెడి కోస‌మే పాత్ర‌లేవీ క‌న‌ప‌డ‌వు కానీ, స‌న్నివేశాల నుండి వ‌చ్చిన కామెడి బావుంది.  ద‌ర్శ‌కుడు ఏ పాత్ర‌ను ఎవ‌రైతే చేయ‌గ‌ల‌రో వారు అతికిన‌ట్టు సరిపోయార‌నిపించింది. ఇక మ‌ణిశ‌ర్మగారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. అలాగే స‌మీర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. స‌న్నివేశాల‌కు త‌గిన విధంగా సీన్స్‌లో స‌మీర్ ఉప‌యోగించిన లైటింగ్ బావుంది.

నెగ‌టివ్ ఎలిమెంట్స్:

ద‌ర్శ‌కుడు త‌ను డైరెక్ట్ చేసిన  భ‌లేమంచి రోజు సినిమా తీసిన ఫార్మేట్‌లో సినిమా లింకింగ్ ప్రాసెస్‌లో సినిమాను న‌డిపించాడు. ఒక సీన్‌కు మ‌రో సీన్‌ను లింక్ పెట్టాడు. ఇలాంటి స్క్రీన్‌ప్లేలు తెలుగు ఆడియెన్‌కు కొత్తేమీ కాదు. క‌థ‌లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క‌లిగించే ఆంశ‌మేది ఉండ‌దు. ప్రేక్ష‌కుడు విప‌రీతంగా ఎంజాయ్ చేసే కామెడి కూడా లేదు. అయితే స‌న్నివేశాల ప‌రంగా ఉన్న కామెడి స్మైల్‌ను తెప్పిస్తుంది.

బోట‌మ్‌లైన్: సినిమా స్క్రీన్‌ప్లే క్లారిటీతో చ‌క్క‌గా ఉంది. మొత్తంగా శ‌మంత‌కమ‌ణి చిత్రాన్ని ప్రేక్ష‌కుడు ఎంజాయ్ చేస్తాడు

Shamanthakamani English Version Review

Rating : 3.0 / 5.0