శంకర్, రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ఫిక్స్!

  • IndiaGlitz, [Friday,February 12 2021]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం. ఈ మధ్య చెర్రీ అన్నీ పాన్ ఇండియా మూవీసే చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న చెర్రీకి ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే మరో పాన్ ఇండియా మూవీలో చేసే అవకాశం ఉంది. అయితే నెక్ట్స్ సినిమా డైరెక్టర్ కూడా స్టార్ డైరెక్టర్ కావడం విశేషం. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోందని తెలుస్తోంది.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని అన్నీ ఓకే అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది. నిజానికి శంకర్, కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది అయితే వివిధ కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది నిలిచిపోయింది. కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈలోగా శంకర్ మరో చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

చెర్రీతో శంకర్ సినిమా అనుకుని అనుకోక ముందే దిల్‌ రాజు అవకాశాన్ని దక్కించుకునేందుకు చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ శంకర్‌తో సమావేశమైనట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు కానీ సినిమా మాత్రం పక్కా అని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమాను చెర్రీ పక్కనబెట్టేస్తాడని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే శంకర్‌తో సినిమాపైనే చెర్రీ పూర్తిగా దృష్టి పెడతాడని సమాచారం. దిల్ రాజుకు కూడా ఇది అత్యంత భారీ ప్రాజెక్టు అవుతుందని టాక్.