Download App

Sharabha Review

మంచి... చెడుల మ‌ధ్య పోరు ఎప్ప‌టీకీ ఉంటుంది. తాత్కాలికంగా చెడు మంచిపై గెలిచినా.. చివ‌ర‌కు దైవానుగ్ర‌హంతో మంచి జ‌యిస్తుంటుంది. అలాంటి క‌థతో ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ‌రావు `శ‌ర‌భ‌`క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. ఇలాంటి చిత్రాల్లో గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ‌రావు మ‌రి సినిమాను ఎలా తెర‌కెక్కించాడనేది తెర‌పై చూడాల్సిందే. ఈ చిత్రం ద్వారా అకాష్ కుమార్ స‌హ‌దేవ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. మ‌రి శ‌ర‌భ అంటే ఎవ‌రు?  దైవ‌శ‌క్తికి దుష్ట‌శ‌క్తి ఎలా అడ్డుప‌డింది? అనేది తెలియాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...

క‌థ‌:

దుష్ట శ‌క్తుల‌ను ఉపాసించే మాంత్రికుడు చంద్రాక్ష‌(పునీత్ ) ప‌ది హేడు సంవత్స‌రాల పాటు ప‌దిహేడు మంది క‌న్య‌ల‌ను బ‌లి ఇచ్చి అద్భుత శ‌క్తుల‌ను సంపాదిస్తాడు. 18 ఏట బ‌లిస్తే విశ్వంలోని దైవాన్ని మించిన శ‌క్తిగా ఎదుగుతాడు. అందుకోసం విష్ణుపురం అనే ప్రాంతంలో పూజ‌లు చేసుకోవ‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకుంటాడు. పాతికేళ్ల త‌ర్వాత చంద్రాక్షుని కుమారుడు ర‌క్తాక్షుడు(చ‌ర‌ణ్ దీప్‌) తండ్రి స‌గంలో విడిచిపెట్టిన కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌నుకుంటాడు. అంతే కాకుండా త‌న తండ్రి ఆత్మ‌ను ఆయ‌న శ‌రీరంలోని ప్ర‌వేశ పెట్టాల‌ని అనుకుంటాడు.  అప్పుడు శివ‌గిరి ప్రాంతంలోని శ‌ర‌భ‌(ఆకాష్ కుమార్ స‌హ‌దేవ్‌).. ర‌క్తాక్షునికి ఎలా అడ్డుప‌డ‌తాడు. అస‌లు చంద్రాక్షుని 18వ పూజ‌కు అడ్డుప‌డింది ఎవ‌రు?  చివ‌ర‌కు దైవ‌శ‌క్తి దుష్ట‌శ‌క్తిపై ఎలా గెలిచింది?  శ‌ర‌భ ..దైవ‌శ‌క్తికి ఎలా త‌న తోడ్పాటును అందించాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేష‌ణ‌:

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ వ‌ద్ద ప‌నిచేసిన నర‌సింహారావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి చిత్రం `శ‌ర‌భ‌`. తొలిసినిమానే గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా ఎంచుకుని న‌ర‌సింహ‌రావు ఓ ర‌కంగా పెద్ద చాలెంజ్ తీసుకున్నాడు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే తొలి చిత్రంలో గ్రాఫిక్స్ విష‌యంలో న‌ర‌సింహ‌రావు అవుట్‌పుట్‌ను చ‌క్క‌గా రాబ‌ట్టుకున్నాడు. దైవ శ‌క్తికి, దుష్ట‌శ‌క్తికి మ‌ధ్య స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అయితే హీరో, హీరోయిన్ సినిమాకు పెద్ద డ్రాబాక్‌. హీరో ఆకాశ్‌కుమార్‌, హీరోయిన్ మిస్టి చ‌క్ర‌వ‌ర్తి న‌ట‌న గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచింది. అయితే తొలి చిత్రం కావ‌డంతో హీరో నుండి మంచి న‌టన‌ను ఆశించ‌లేం. అయితే ప్రస్తుతం ఉన్న పోటీల్లో తొలి సినిమా నుండి ప‌రుగు పెట్టాల్సిందే.   క‌థ ప‌రంగా కొత్త‌ద‌నం లేక‌పోయినా.. క‌థ‌నం బాగానే ఉంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ వీక్‌గా ఉంది. కోటి అందించిన పాట‌లు గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. నేప‌థ్య సంగీతం బాగానే ఉంది. ర‌మ‌ణ సాల్వ కెమెరావ‌ర్క్ బావుంది. గ్రాఫిక్స్ చాలా బావుంది. గ్రాఫిక్స్ సినిమాను ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ ఇంత చ‌క్క‌గా తెర‌కెక్కించాడా? అనేంతగా సినిమా ఉంటుంది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో సినిమాను సాగ‌దీశారు. కాస్త సినిమాను ట్రిమ్ చేసుంటే బావుండేద‌నిపించింది. మొత్తంగా దైవ‌శ‌క్తిపై దుష్ట‌శ‌క్తి పైచేయి సాధించే క్ర‌మంలో వ‌చ్చే ట్విస్టులు, ఆ స‌మ‌యంలో వ‌చ్చే గ్రాఫిక్స్ అన్ని బావున్నాయి.

చివ‌ర‌గా.. శ‌ర‌భ‌.. గ్రాఫిక్స్‌కే ప్రాధాన్య‌త‌

Rating : 2.0 / 5.0