close
Choose your channels

కేసీఆర్‌కు కోలుకోలేని షాక్.. బీజేపీలోకి ఎంపీ!

Friday, July 12, 2019 • తెలుగు Comments

కేసీఆర్‌కు కోలుకోలేని షాక్.. బీజేపీలోకి ఎంపీ!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాషాయం జెండాను పాతాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సిట్టింగ్‌ నేతలు, ముఖ్యనేతలు, మాజీ నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరుకుంటున్నారు. అయితే మొదట టీడీపీ అధినేత టార్గెట్‌ చేసిన బీజేపీ.. దాదాపు ఆయనకు ఆర్థికంగా అండగా ఉన్నవారందర్నీ తమవైపు లాక్కుంది.. త్వరలోనే మరికొదరు పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది.

కవితను ఘోరంగా ఓడించిన డీఎస్ కొడుకు!
అయితే.. ఇక తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన కేంద్రమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. గులాబీ బాస్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఎంపీ సీట్లు గెలవడం.. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత.. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఘోర ఓటమిని చవిచూడటం ఇలా వరుస షాక్‌లతో టీఆర్ఎస్ సతమతవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు టాటా చెప్పి.. కారెక్కిన కీలక నేత, సీనియర్ డీకే శ్రీనివాస్‌కు రాజ్యసభ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఈయన పార్టీలో చేరారే కానీ.. ఎన్నడూ ప్రభుత్వం పరంగా కానీ.. సొంతంగా కానీ ఒక్కటంటే ప్రెస్‌మీట్‌లు సైతం ఆయన పెట్టలేకపోవడం గమనార్హం.

డీఎస్‌కు కవిత వార్నింగ్!
అయితే నిజామాబాద్ నుంచి కవితపై డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ 70,875 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కవితపై గెలిచి రికార్డ్ సృష్టించడంతో సంజయ్ పేరు యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత ఘన విజయం సాధించిన తన కుమారుడిగా అండగా ఉండాలని భావించిన డీఎస్ కారు దిగి కాషాయం కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి డీఎస్ .. టీఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి ఆయనపై వివాదాలే వివాదాలు.. ఆఖరికి మాజీ ఎంపీ కవిత కూడా ఒకానొక సందర్భంలో డీఎస్‌ను టార్గెట్ చేశారు కూడా.. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఆయనకు కవిత ఒకింత వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు.

కారు దిగి కమలం గూటికి!
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన డీఎస్.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదన్న కారణంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక పార్టీలో ఉండటం సమంజసం కాదని భావించిన డీఎస్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల షా తెలంగాణలో పర్యటించిన తర్వాత చేరికలు మరింత ఎక్కువయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే ఈ భేటీపై డీఎస్ మాత్రం ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. సో.. మొత్తానికి చూస్తే డీఎస్ కూడా అతి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఇదే జరిగితే కేసీఆర్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్‌గా తండ్రీ డీఎస్.. కొడుకు సంజయ్ ఇద్దరూ ఒకటై ఒకే పార్టీలో ఉండబోతున్నారన్న మాట. 

Get Breaking News Alerts From IndiaGlitz