close
Choose your channels

'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే..!!

Saturday, July 13, 2019 • తెలుగు Comments

‘జగనన్న జంపింగ్ జపాంగ్’ అని పేరు పెడితే..!!

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాతి నుంచి వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ వస్తున్న ఆయన... శనివారం మరోసారి ట్వీట్ చేశారు.

అసలేమీ ఇవ్వలేదని మీరేం ఇచ్చారు.!

‘రైతుల వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు ఇస్తామని @ysjagan గారు తన సొంత జిల్లాలో తమ తండ్రిగారి పేరున రైతు దినోత్సవం జరుపుతూ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని ఒకరోజు అన్నారు. తీరా బడ్జెట్ లో నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు’ అని వడ్డీలేని రుణాలపై వైసీపీని నారా లోకేష్ టార్గెట్ చేశారు.

‘జగనన్న జంపింగ్ జపాంగ్’!

ఆ తర్వాత కొద్దిసేపటికే.. ‘@ysjagan గారూ, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా ‘జగనన్న జంపింగ్ జపాంగ్’ అని పేరు పెడితే బాగుండేది’ అంటూ పథకాలకు జగన్ పేరు పెట్టడంపై మాజీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రామాయణమంతా చదివి!

‘బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావిస్తూ ఆర్ధిక మంత్రి బుగ్గన రామాయణాన్ని ఉదహరించారు.. దీనిని లోకేశ్ వదల్లేదు.. ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారు, సంజీవని గురించి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారు. చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు విదిల్చారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

పిచ్చుక గూళ్ళు కాదుకదా!

‘ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. పైగా గృహరుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. బడ్జెట్ చూస్తే గృహ నిర్మాణానికి కేవలం రూ.8,615 కోట్లు ఇచ్చారు. @ysjagan గారూ! మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా’ అని వైఎస్సార్ గృహనిర్మాణ పథకంపై సెటైర్లు వేశారు. లోకేష్ ట్వీట్స్‌పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz