close
Choose your channels

శివసేన- కంగనల మధ్య పోరు కొత్త మలుపు..  మంచే జరిగింది!

Thursday, September 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివసేన- కంగనల మధ్య పోరు కొత్త మలుపు..  మంచే జరిగింది!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనకు ఏమైంది..? అంతమందికి టార్గెట్ అయ్యేందుకు ఆమె చేసిన తప్పేంటి? ఇప్పటి వరకూ కనిపించని ఆమె అక్రమ కట్టడాలు సడెన్‌గా పాలకులకు కనిపించడమేంటి? భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్టా? లేనట్టా?.. ఇవన్నీ ప్రస్తుతం కంగన విషయంలో పలువురికి కలుగుతున్న సందేహాలు. అయితే ఆమె సహజంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయమై తనకు అనిపించింది నిర్మొహమాటంగా చెప్పేశారు. అక్కడ నుంచి రచ్చ మొదలైంది.

సుశాంత్ ఆత్మహత్య కేసుతో పాటు, డ్రగ్స్ , నెపోటిజం విషయంలో కంగన సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఈ హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ ఆగితే సమస్య తీవ్రత పెరిగేది కాదేమో.. మహారాష్ట్ర అధికార శివసేన పార్టీని సైతం టార్గెట్ చేశారు. సుశాంత్ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ముంబై నగరం పీవోకేలా మారిందని విమర్శించారు. దీంతో శివసేన కీలక నేతతో పాటు పలువురు నేతలు ఆమెకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ఏకంగా ముంబైలో అడుగుపెట్టు చూద్దాం అంటూ హెచ్చరించారు. ఈ వివాదాలన్నింటి నడుమ కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ నేపథ్యంలోనే పాలక శివసేన, కంగనల మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. కంగన ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌ కూల్చివేసింది. ఈ కార్పొరేషన్‌ కూడా శివసేన పాలనలోనే ఉండటం గమనార్హం. ముంబైలోని ఆమె ఇంటికి అనుబంధంగా ఉన్న ఆఫీసు అక్రమ నిర్మాణమని కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం నోటీసు అంటించారు. అనంతరం ఆమె సమాధానం కూడా ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండానే బుధవారం కూల్చివేతకు నోటీసిచ్చారు. ఇచ్చిందే తడవుగా బుధవారమే జేసీబీలతో అక్కడకు చేరుకుని కూల్చివేయడం మొదలుపెట్టారు. హుటాహుటిన కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్‌ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే విధించింది. ఇంటి యజమాని లేనప్పుడు ఇంటోక్లి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదవేసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఓ రేంజ్‌లో మాటల తూటాలు పేలుస్తూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే మీరుఏమనుకుంటున్నారని కంగన ఫైర్ అయ్యారు. మూవీ మాఫీయాతో చేతులు కలిపి తన భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ రోజు తన ఇల్లు కూలిపోయిందని.. రేపు మీ అహంకారం కూలిపోతుందంటూ వీడియోలో మండిపడ్డారు. మనం కాలచక్రంలో ఉన్నామన్న సంగతిని థాక్రే గుర్తుంచుకోవాలని కంగన పేర్కొన్నారు. ముంబై లోని తన ఆఫీస్‌ను అధికారులు కూల్చడాన్ని కంగన కశ్మీర్‌ పండితుల దుస్థితితో పోల్చారు. అయితే ఒక విధంగా తనకు మంచే జరిగిందని.. కశ్మీరీ పండితులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైందని కంగన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఒక అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపై కూడా సినిమా తీస్తానని ప్రతిన పూనారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.