close
Choose your channels

సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి

Tuesday, May 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి

ఈ భూమికి ఒకే ఒక ఆకాశం
అలాగే
చలన చిత్ర పరిశ్రమకి ఒకే ఒక సావిత్రి.
సావిత్రి అంటే మహానటి కాదు.
మహానటి అంటే సావిత్రి.
ఎందుకంటే
మహానటి - అనే నాలుగక్షరాల పదానికి 
మూడక్షరాల తాత్పర్యం, రెండక్షరాల అర్ధం  - సావిత్రి.
అందుకే 
ఎంత పెద్ద డైలాగునైనా ఓ చిన్న ఎక్స్ ప్రెషన్ కి  కుదించుకుని
అనువదించుకుని అందించగలదామె.
అందుకే 
ఇప్పటిదాకా దీన్ని మార్చాల్సిన అవసరం, అవకాశం రాలేదు. రాదు కూడా.

ఉదాహరణకి -

"దొంగ రాముడు" సినిమాలో " చిగురాకులలో చిలకమ్మా" పాటలో కూచున్న చోటు నుంచికదలకుండా కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో తనవంతు పాటని నడిపించింది.

అలాగే "అప్పుచేసి పప్పుకూడు" సినిమాలో "ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి" పాటలో నిల్చున్న చోటు నుండి కదల కుండా ...

అలాగే " మాంగల్యబలం" సినిమాలో "తెలియని ఆనందం" పాటలో మళ్ళీ కూచున్న చోటి నుండి కదలకుండా ....
నిజానికి ఈ పాట చిత్రీకరణ సమయానికి సావిత్రి గర్భవతి. అప్పటికే ఊటీలో తియ్యాల్సిన షెద్యూల్ వర్షాల కారణంగా వాయిదా పడింది. అంచేత చెన్నై సెట్ లోనే ప్లాన్ చేశారు. గర్భవతి కనుక లేచి తిరగడాలు, పరుగెత్తడాలు లేకుండా - ప్రేక్షకులకు ఏ అనుమానం రాకుండా - కేవలం ఎక్స్ ప్రెషన్స్ తోనేమ్యానేజ్ చేసిందామె.

అంతే కాదు అదే "మాంగల్యబలం" సినిమాలో " ఆకాశ వీధిలో అందాల జాబిలి" పాటకు ముందు "ఓ ఓ ఓ" అంటూ సుశీల ఆలాపన వస్తుంది. ఆ పాట చిత్రీకరణ పూర్తయిపోయేక " ఆడవాళ్ళు అంతసేపు పెదవులు ముందుకు పెట్టి ఆలపిస్తూ వుంటే తెర మీద బాగుండదండీ . ఇక ముందు ఇటువంటి ఆలాపనలు హీరోయిన్ల మీద తీసేటప్పుడు " ఆ ఆ ఆ" అని వచ్చేట్టు చూడండి." అని అంది సావిత్రి. ఆమె సునిశిత పరిశీలనకి ఆశ్చర్యపోయి చూశారు - అక్కినేని, ఆదుర్తి, దుక్కిపాటి. 

ఏ హీరో ని చూడడానికి జనం తో వెళ్ళి, కాలువలో పడి, బట్టలు పాడు చేసుకుందో ఆ హీరో తోనే నటిస్తూ -

ఎన్నో విన్నూతన ప్రయోగాలకు నాంది పలికిన దర్శక మేధావి ఎదురుగా -

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి, అక్కినేని లాంటి వారు కూడా మారు మాట్లాడడానికి జంకే  నిర్మాతకు సలహా ఇవ్వాలంటే - స్క్రీన్ ప్రెసెన్స్ మీద ఎంతటి అవగాహన వుండాలి ? దటీజ్ వన్ అండ్ ఓన్లీ వన్ సావిత్రి.

"మాయాబజార్ లో హీరో - డ్యూయెట్లు పాడిన నేను కాదు. సూత్రధారి ఎన్టీయార్ కాదు. ఇంట్రవెల్ నుంచి కథను భుజానికెత్తుకున్న రంగారావూ కాదు. సావిత్రి ... సావిత్రి మాత్రమే మాయాబజార్ కి హీరో, హీరోయిన్ అన్నీను" అనేవారు అక్కినేని ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా. 

"బెంగాలీ లో దీప్ జలే జయ్ , తెలుగు లో చివరకు మిగిలేది, హిందీ లో ఖామోషి మూడూ ఒకటే కథ. బెంగాలీ లో సుచిత్రా సేన్, తెలుగు లో సావిత్రి, హిందీలో వహీదా రెహమాన్. ఈ మూడు సినిమాల్నీ దగ్గర పెట్టుకుని క్లయిమాక్స్  సీన్ చూడండి. సావిత్రి ని  గొప్ప నటి అని ఎందుకంటారో మీకే తెలుస్తుంది." అని వివరిస్తారాయన . 

"గలగలమని నవ్వడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే "కన్యాశుల్కం" లో మధుర వాణి పాత్రని చూడండి. మా "చదువుకున్న అమ్మాయిలు"  సినిమాలో "టోకెన్ తీసుకోవడం డబ్బివ్వడం" అనే డైలాగ్ దగ్గర చూడండి" అంటూ పారవశ్యంలోకి కూడా వెళ్ళిపోతారాయన.

ఇలాంటి ఉదాహరణలు ఆనాటి నటీనటులెంత మందిని అడిగినా ఎన్నెన్నో చెబుతారు. సావిత్రి కేవలం ఏయన్నార్, ఎన్టీయార్ వంటి అగ్ర నటులతోనే కాదు కమర్షియల్ గా ఓ మెట్టు తక్కువుండే కాంతారావు, జగ్గయ్యల తోనూ, రేలంగి వంటి కమేడియన్ తోనూ (మామకు తగ్గ అల్లుడు) కూడా హీరోయిన్ గా నటించి తనేమిటో ఋజువు చేసుకుంది.

అందుకే మహానటి అంటే సావిత్రి.

కానీ సావిత్రి మహానటి ఎందుకు కాదంటే -
జీవితంలో దెబ్బ తిని, ఆరోగ్యం పాడు చేసుకుని, అవకాశాలు సన్నగిల్లిన రోజుల్లో కూడా గుమ్మడి గారికి ఒంట్లో బావులేదని తెలిసి ఆయన దగ్గరతనెప్పుడో తీసుకున్న డబ్బుని ఆయనకి తెలియకుండా ఆయన దిండుకింద పెట్టేసి వచ్చేసిన సత్తెకాలెపు సత్తెమ్మ ఆమె.

అంతవరకూ సావిత్రి అంటే కార్లు , అది తినండి ఇది తినండి అని కేరియర్లకు కేరియర్లు తీసుకుచ్చే ప్రొడక్షన్ వారు - ఆమె కమర్షియల్ గా ఫేడవుట్ అవగానే పట్టించుకోవడం మానేశారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె వైపు చూసే నాధుడే లేడు.

ఈ  తతంగాన్ని గమనించిన గుమ్మడి గారు ఆమెను పిలిచి కూచోబెట్టుకుని తన క్యారేజ్ లోని భోజనాన్ని పెడితే ’ఆత్మాభిమానం తో" ఆకలిగా లేదని" మొదట మొరాయించినా గుమ్మడి గారి బలవంతం మీద ఒక్కొక్క ముద్దా తింటూ కన్నీళ్ళు పెట్టుకున్న పిచ్చితల్లి ఆమె.

ఓ సారి తనికెళ్ళ భరణి ఓ రైల్వే స్టేషన్ లో సావిత్రి ని చూశాడు.  ముందూ వెనకా ఎవరూ లేరు. ఏ వైభోగాలూ లేవు . తన సూట్ కేస్ తనే మోసుకుంటూ మౌనంగా నడుచుకుంటూ వేళుతోందామె.

ఆ సంఘటన ని చెబుతూ "పాడుబడ్డ బావిలో చందమామ లా వుంది" అని అన్నాడు ఏడుపు గొంతుతో. 

అందుకే సావిత్రి మహానటి కాదు.

ఉత్తరాది నటుడు, దర్శకుడు గురుదత్ మీద ఓ బయోపిక్ వచ్చింది. అందులో ఆయన ప్రేమ వ్యవహారాల ప్రసక్తే కానీ ఆయన ఆత్మ ని సరిగ్గా ఆవిష్కరించలేక పోయారనిపించింది "మహానటి" దర్శకుడు నాగ్ అశ్విన్ కి. ఆ తర్వాత ఎన్నో బయోపిక్స్ చూశాడాయన. అవేవీ సంతృప్తిని ఇవ్వలేకపోయాయి.

అప్పుడనిపించిందాయనకి - అద్భుతమైన ఆత్మావిష్కరణకి సావిత్రి జీవితాన్ని మించినది లేదని.

తత్ఫలితంగా చేసిన విస్తృత పరిశోధనకి దృశ్యరూపమే "మహానటి" చిత్రం.

అందుకే ఈ చిత్రం కొందరికి పరీక్ష .  ... మరికొందరికి   పెద్ద బాల శిక్ష.

- రాజా (మ్యూజికాలజిస్ట్)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.