close
Choose your channels

చిరు 150వ చిత్రం కోసం ఇండియాలో ఆరు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు..!

Thursday, October 13, 2016 • తెలుగు Comments

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఖైదీ నెం 150వ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...తొమ్మిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత మెగాస్టార్ న‌టిస్తున్న ఖైదీ నెం 150 సంచ‌ల‌న విజ‌యం సాధించాల‌ని కోరుతూ అభిమానులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఖైదీ నెం 150 ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి హృద‌యాల‌ను రంజింప చేయాల‌ని  అభిల‌షిస్తూ...మెగా అభిమానుల సంబ‌రం అంబ‌రంమంటేలా చేయాల‌ని ఆశిస్తున్నారు అభిమానులు. అలాగే మొద‌టిసారి చిత్ర నిర్మాణం చేప‌ట్టి నిర్మాత‌గా మారిన చ‌ర‌ణ్ కి ఈ చిత్రం అద్భుత విజ‌యం అందించాల‌ని..కాసుల వ‌ర్షం కురిపించాల‌ని కోరుకుంటూ ఇండియాలోని ఆరు ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. అభిమానులు త‌మ అభిమాన హీరో న‌టించిన చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుతూ ఇండియాలో ఆరు ప్ర‌ముఖ దేవాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం..!
 
మెగా అభిమానులు ఇండియాలోని ఆరు ప్ర‌ముఖ దేవాల‌యాల్లో చేయ‌నున్న ప్ర‌త్యేక పూజ‌ల వివ‌రాలు...
 
1) న‌వంబ‌ర్ 4 శుక్ర‌వారం..
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావ‌రి జిల్లా అయిన‌విల్లి గ్రామంలో శ్రీవిఘ్నేశ్వ‌ర దేవాల‌యం కృత‌యుగం నుండే నెల‌కొని ఉన్న‌ట్లుగా చెప్ప‌బ‌డుతుంది. ఈ ఆల‌యంలోని స్వ‌యంభూగా వెల‌సిన గ‌ణ‌ప‌తిని అత్యంత మ‌హిమాన్వితునిగా ప్ర‌జ‌లు కొలుస్తారు. ఈ ఆల‌యం నందు
శ్రీ ల‌క్ష్మి గ‌ణ‌ప‌తి చ‌తురావృతి త‌ర్ప‌ణ స‌హిత ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి హోమం, గ‌రిక‌తో మ‌రియు మోద‌కాల‌తో అర్చ‌న మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు.
 
2) న‌వంబర్ 14 సోమ‌వారం
 
ద‌క్షిణ క‌ర్నాట‌క‌లో ఎంతో విశిష్ట‌త క‌లిగిన 800 ఏళ్ల నాటి శ్రీమంజునాథ స్వామి ఆల‌యం ధ‌ర్మ‌స్థ‌ల‌లో నెల‌కొని ఉంది.ఈ ఆల‌యంలో ప‌ర‌మేశ్వ‌రునికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన కార్తీక పూజ‌లు, భిల్వ ద‌ళ‌ముల‌తో ల‌క్ష‌ప‌త్రి పూజ‌, ఏకాద‌శ రుద్రాభిషేకం మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు.
 
3 ) న‌వంబ‌ర్ 27 ఆదివారం
 
తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్ కు అల్లంత దూరాన ఉన్న ప్ర‌సిద్ద పుణ్య  క్షేత్రం య‌దాద్రి నందు శ్రీ ల‌క్ష్మీ న‌ర‌శింహ స్వామి దేవాల‌యం క‌ల‌దు. ఈ మ‌హా దేవాల‌యంలో మాస శివ‌రాత్రి మ‌రియు స్వాతి న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ ల‌క్షీ నార‌సింహ మూల మంత్ర సుద‌ర్శ‌న హోమం మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.
 
4 ) డిసెంబ‌ర్ 13 మంగ‌ళ‌వారం
 
త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కాంచీపురం ప‌ట్ట‌ణంలో కంచి కామాక్షి అమ్మ‌వారు వెల‌సి ఉన్నారు. ఈ ప‌విత్ర పుణ్య‌క్షేత్రం నందు మూఖ‌పంచ‌శ‌తి పారాయ‌ణం మ‌రియు మార్గ‌శిర పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకుని పౌర్ణ‌మి పూజ‌లు చండీ పారాయ‌ణం చండీ హోమం మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌బ‌డును.
 
5 ) డిసెంబ‌ర్ 27 మంగ‌ళ‌వారం
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వార‌ణాసి న‌గ‌రంలోని కాశీ విశ్వ‌నాధుడు ప‌విత్ర గంగాన‌ది ఒడ్డున వెల‌సి ఉన్నారు. ఈ మ‌హా పుణ్య‌క్షేత్రంలో హంస తీర్ధం నందు గ‌ల కృతివాసేశ్వ‌ర గ‌జాసుర లింగ‌మున‌కు ఏక‌ద‌శ రుద్రాభిషేకం, మ‌ణిక‌ర్ణిక ఘూట్ నందు మ‌హా సంక‌ల్ప యుక్త‌స్నానం,  శ్రీ కాశీ విశాల‌క్షి శ‌క్తి పీఠం నందు అఘేర పాశుప‌త హోమం. కాశీ విశ్వ‌నాధునికి మ‌హా రుద్రాభిషేకం మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌బ‌డును.
 
6 )  జ‌న‌వ‌రి 8 ఆదివారం
 
మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్ ప‌ట్ట‌ణంలో శ‌క్తిపీఠాల్లో ఏడ‌వ పుణ్య‌క్షేత్రం శ్రీ మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి దేవాల‌యం. ఈ శ‌క్తిపీఠ అమ్మ‌వారి క్ష్రేతం నందు ముక్కోటి ఏకాద‌శి పూజ‌లు, లలిత స‌హ‌స్ర నామ పారాయ‌ణం, విష్ణు స‌హ‌స్ర నామ పారాయ‌ణం, శ్రీసూక్త స‌హిత మ‌హాల‌క్ష్మి హోమం, శ్రీచ‌క్ర న‌వావ‌ర‌ణ అర్చ‌న మ‌రియు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు.