శ్రీరెడ్డి సక్సెస్.. ‘క్యాస్టింగ్ కౌచ్‌’‌‌పై కమిటీ ఏర్పాటు

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

టాలీవుడ్‌లో జరుగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్‌’ నటి శ్రీరెడ్డి ఉద్యమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం అన్ని సినీ ఇండస్ట్రీలకు తెలియడం.. జాతీయ మీడియా సైతం ఈ వార్తలను కవర్ చేయడం జరిగింది. అంతేకాదు ఆఖరికి తనకు న్యాయం చేయాలంటూ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీ శక్తి చేసిన ఈ పోరాటానికి పలువురు నటీనటులు, ప్రముఖులు సైతం అండగా నిలిచారు. అంతేకాదు గతంలో వివిధ మహిళా సంఘాలు కూడా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కమిటీలో ఉన్న మహిళలు ఎవరు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఇక కఠిన చర్యలు తీసుకొని బాధితులకు అండగా నిలవాలని సర్కార్ భావించింది. ఇందుకుగాను టాలీవుడ్‌లో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఫ్యానల్‌లో సభ్యులు పేర్లతో సహా ఉత్తర్వుల్లో చెబుతూ బుధవారం రోజున ప్రకటన చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 984 ప్రకారం.. నటి సుప్రియ, సినీనటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో ప్రతినిధులుగా నియమించడం జరిగింది. అంతేకాదు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మికి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది.

పురుషులు కూడా..!

ఇదిలా ఉంటే.. ఈ కమిటీలో కేవలం మహిళలకే కాకుండా పురుషులకు చోటు కల్పించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక నిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ ప్రకటించింది. సో.. ఇకపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న మాట. కాస్త ఆలస్యమైనా సర్కార్ మాత్రం మంచి నిర్ణయం తీసుకుందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. తెలంగాణ సర్కార్ నియమించిన ఈ కమిటీపై ఇంత వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరూ స్పందించలేదు. అంతేకాదు దీనిపై పోరాటం చేసిన శ్రీరెడ్డి కూడా ఇంత వరకూ స్పందించలేదు. అయితే ఆమె స్పందిస్తే ఈ కమిటీ సభ్యులపై ఏమేం కామెంట్స్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.