హైదరాబాద్‌లో ‘పది’ పరీక్షలో వాయిదా..

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో రోజుకు వందకు పైగానే కేసులు నమోదవుతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని కొందరు సామాజివేత్తలు హైకోర్టును ఆశ్రయించగా.. శనివారం సాయంత్రం దీనిపై చర్చ జరిగింది. వాదోపవాదాలు విన్న అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు తేల్చిచెప్పేసింది. జీహెచ్ఎంసీలో పరీక్షలు వాయిదా వేసి, సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతులిచ్చి వారందరినీ రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని గవర్నమెంట్‌ను ఆదేశించింది. కాగా.. జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా.. ఇందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైకోర్టు ఆగ్రహం..

ప్రభుత్వ తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించగా.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు..? విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు..? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని న్యాయస్థానం కన్నెర్రజేసింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే.. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్మెంట్‌గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. జీహెచ్ఎంసీలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ పరీక్షలు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.