బాంబ్‌ బ్లాస్ట్‌ సీన్‌లో సందీప్‌ కిషన్‌కు గాయాలు

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ.బీ.ఎల్‌’. ప్రస్తుతం చిత్రబృందం కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రోజు మాదిరిగానే శనివారం నాడు కర్నూల్ జిల్లాలో జరిగిన ‌షూటింగ్‌లో హీరో సందీప్ కిషన్ గాయాలపాలయ్యారు. ఫైట్ మాస్టర్ తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబ్ బ్లాస్ట్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా హీరోకు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై హుటాహుటిన కర్నూలు ఆస్పత్రికి తరలించి హీరోకు చికిత్స చేయిస్తున్నారు. అయితే ప్రస్తుతం సందీప్ కిషన్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రతీ విషయాన్ని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునే సందీప్ కిషన్ ఈ ఘటన గురించి మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో సందీప్ కిషన్ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు సినీ ప్రియులు, అభిమానులు సందీప్ కిషన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.