పవన్ - రానా మూవీ మేకింగ్ వీడియో.. సర్ ప్రైజ్ అదిరింది!

  • IndiaGlitz, [Tuesday,July 27 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజాను బాహుడు రానా దగ్గుబాటి కలసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఉదయం ప్రకటించినట్లుగా చిత్ర యూనిట్ తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.

మేకింగ్ వీడియోతోపాటు సర్ ప్రైజ్ కూడా అదిరింది. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో 50 సెకండ్ల మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పోలీస్ గెటప్ లో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ ఫుల్ లుక్ చూపించారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వాకింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది.

రానా, పవన్ తో పాటు దర్శకుడు సాగర్ చంద్ర, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా మేకింగ్ వీడియోలో చూపించారు. వారి మధ్య చర్చలు జరుగుతున్న దృశ్యాలని మేకింగ్ వీడియోలో ప్రెజెంట్ చేశారు. ఇంతకీ మేకింగ్ వీడియోలో సర్ ప్రైజ్ ఏంటంటే.. చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించింది.

ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. భీమ్లా నాయక్ ఈ సంక్రాంతికి రిపోర్ట్ చేయడానికి వస్తున్నాడు అంటూ మేకింగ్ విడియాలో చూపించారు.

ముందుగా సంక్రాంతికి పవన్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లుని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఆ చిత్ర షూటింగ్ ఆలస్యం కానుండడంతో ఆ ప్లేస్ లోకి ఈ మూవీ వచ్చింది. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ మాత్రం మిస్ కావడం లేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ నుంచి రాబోయే చిత్రం ఇదే.