close
Choose your channels

'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రివ్యూ

Friday, July 3, 2015 • తెలుగు Comments

స్టార్ హీరోల పేర్లను చిన్న సినిమాల్లో వాడుకోవడం కామన్ విషయమే. అలాంటి ప్రయత్నంతో రూపొందిన చిత్రమే సూపర్ స్టార్ కిడ్నాప్. ఇందులో మహేష్ పేరుని, తను నటించిన చిత్రాల్లో కొన్ని డైలాగ్స్ ను వాడుకున్నారు. లక్కీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో ఆదర్శ, నందు, భూపాల్ లు నటించారు. కామెడి ఎంటర్ టైనర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...

కథ

నందు(నందు), ప్రేయసి ప్రియా(పూనమ్ కౌర్) డబ్బు లేని కారణంగా అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. భూపాల్(భూపాల్) సినిమా అవకాశాల కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటాడు. తనకి దర్శకుడు కావాలనేది కల. జై(ఆదర్శ్) ప్రముఖ నిర్మాత తనయుడు. విలాసాల కోసం డబ్బు కావాలనుకుంటుంటాడు. పత్తాలరాజు(ఫిష్ వెంకట్) దగ్గర అప్పు ఉండటంతో కొకైన్ అమ్మిపెడతానని అతనికి మాట ఇస్తాడు. అయితే అనుకోకుండా నందు, భూపాల్ ల కారణంగా కొకైన్ అంతా నీటి పాలవుతుంది. దాంతో 50 లక్షలు డబ్బు అవసరం అవుతుంది. అందువల్ల తన తండ్రి నిర్మిస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ ను కిడ్నాప్ చేద్దామని జై ఐడియా ఇస్తాడు. రెండు ప్రయత్నాలు కూడా చేసి విఫలమవుతారు. అయితే మూడో అటెంప్ట్ లో మహేష్ స్థానంలో కమెడియన్ వెన్నెల కిషోర్ ను కిడ్నాప్ చేస్తారు. తప్పు జరిగింది కాబట్టి వెన్నెల కిషోర్ ను వెళ్లిపొమ్మని చెప్పినా కిడ్నాప్ నాటకం కంటిన్యూ చేసి డబ్బులు సంపాదించమని అతనే మిగిలిన ముగ్గురికి చెబుతాడు. వారు సరేనంటారు. అప్పుడు నలుగురు కలిసి ఏం చేస్తారు? కిడ్నాప్ డ్రామా ఏ మలుపు తిరుగుతుంది? చివరకు డబ్బుని సంపాదిస్తారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

నందు, ఆదర్శ్, భూపాల్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. మంచి ఎనర్జీతో కూడిన పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా సెకండాఫ్ ను వెన్నెలకిషోర్ తన భుజాలపై మోశాడని చెప్పాలి. సాయికిషోర్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ కి చక్కగా న్యాయం చేశాడు. సుశాంత్ రెడ్డి మంచి పాయింట్ ను మంచి కథనంతో ముందకు తీసుకెళ్లాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ముగ్గురి చుట్టూనే తిరిగితే సెకండాఫ్ అంతా వెన్నెల కిషోర్ తో పాటు శ్రద్ధాదాస్, పోసాని, ఫిష్ వెంకట్ ల మధ్య తిరిగేలా కథ రాసుకోవడంతో సెకండాఫ్ కామెడిగా సాగిపోతుంది. నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్

సినిమా నిడివి తక్కువగా ఉన్నప్పటికీ సెకండాఫ్ లాగింగ్ అనిపిస్తుంది. ఓ ఐదు నుండి పది నిమిషాల సినిమా ఎడిట్ చేసి ఉండవచ్చు. దర్శకుడు మరింత శ్రద్ధను కనపరిచి ఉంటే ఇంకా సినిమా బావుండేది. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోలేదు. సాయికార్తీక్ ట్యూన్స్ బాగాలేదు. పోసాని పాత్రను పరిమితం చేసేశారు. తాగుబోతు రమేష్, పోసాని కామెడి సరిగా పేలలేదు.

విశ్లేషణ

సినిమా టైటిల్ కి తగిన విధంగానే సినిమాలో మహేష్ బాబు పేరుని బాగానే వాడుకున్నారు. అది సినిమాకి ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. సినిమాలో నాని, తనీష్, అల్లరి నరేష్, మనోజ్ లు తళుక్కున మెరవడం అభిమానులకు ఒకింత ఊరడింపే. మనోజ్ ఎంట్రీ సరిగా లేదు. ఏదో మాస్ ఎలిమెంట్ కావాలని ఉపయోగించుకున్నట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విషయంలో కేర్ తీసుకుని ఉండుంటే సినిమా బావుండేది. సినిమా అంతా కామెడి ఎంటర్ టైనర్ గా కూల్ గా సాగిపోతుంది. సినిమాని ఒకసారి చూడవచ్చు.

బాటమ్ లైన్: సూపర్ స్టార్ కిడ్నాప్` ...ఎంజాయబుల్ కామెడి ఎంటర్ టైనర్

రేటింగ్: 2.5/5

English Version Review

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz