దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో విచారణ.. పోలీసులకు చుక్కెదురు

  • IndiaGlitz, [Thursday,December 12 2019]

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుమారు రెండుగంటలకు పైగా ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో జరిగిన వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గి విభేదించారు. ఎన్‌కౌంటర్‌పై నిజాలు ప్రజలకు తెలియాలని.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇరు పక్షాల వాదనలు హాట్ హాట్‌గా సాగాయి. ఎన్‌కౌంటర్‌పై సిట్ విచారణ జరుగుతోందని.. సమాంతర విచారణ అవసరం లేదని ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని అనుకుంటే ఎన్‌హెచ్‌ఆర్‌సి, హైకోర్టు విచారణ తక్షణమే నిలిపివేయాలని ముకుల్ రోహత్గి కోరారు.

రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి..
ఈ క్రమంలో.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి వీఎస్‌ సిర్‌పుర్కర్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటయ్యింది. కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖ బల్దోదా, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్‌ ఉన్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వివిధ కోర్టులో విచారణలపై 6నెలలపాటు సుప్రీంకోర్టు స్టే విధించింది. కమిషన్‌ విచారణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని.. విచారణపై మీడియా కవరేజ్‌ ఉండొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

పోలీసులకు చుక్కెదురు!
మొత్తానికి చూస్తే.. సుప్రీం కోర్టులో హైదరాబాద్ పోలీసులకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. కమిషన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించి.. ఎన్‌కౌంటర్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను పాటించారని నివేదించారని అయితే సీజేఐ బాబ్డే.. ఈ వాదనలను మాత్రం కోర్టు అంగీకరించలేదు. మరి ఆరు నెలల తర్వాత ప్రభుత్వం ఏం చెబుతుందో..? కమిషన్ ఏమని నివేదిక ఇస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.