'తను నేను' 27న విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్‌ హీరోయిన్‌గా, 'వర్షం' దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'తను నేను' షూటింగ్‌ పూర్తయింది. దీపావళి కానుకగా రిలీజైన టీజ‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వచ్చింది. ఈనెల 27న సినిమా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్ర‌యూనిట్ సినిమా గురించి చెప్పిన సంగ‌తులివి...

స‌మ‌ర్ప‌కుడు, పంపిణీదారుడు డి.సురేష్‌బాబు మాట్లాడుతూ -''నాని, రాజ్‌ తరుణ్‌ ప్రతిభతో హీరోలయ్యారు. నిర్మాత రామ్మోహన్‌ నానీని అష్టాచెమ్మా సినిమాతో, రాజ్‌త‌రుణ్‌ని ఉయ్యాల జంపాల సినిమాతో హీరోల్ని చేశారు. పరిశ్రమని కొందరు గుప్పిట పట్టుకుని కంట్రోల్‌ చేయడం అనేది ఉండదు. ప్రతిభను ఎవరూ అణిచేయలేరు. రామ్మోహన్‌ కథ తయారు చేసుకుని దానికి తగ్గ హీరో కోసం వెతికారు. అలానే నాని హీరో అయ్యాడు. రాజ్‌తరుణ్‌ వెలుగులోకి వచ్చాడు. ప్రతిభకు పట్టంగడతాం అనడానికి వీళ్లే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ ఎవరినీ కంట్రోల్‌ చేయడం అన్నది ఉండదు. ఇక మీదట ఫిర్యాదులు ఆపండి. పని మీద దృష్టి సారించండి. క్వాలిటీ వర్క్‌ కోసం తపించండి. రామ్మోహన్‌ మరో కొత్త కుర్రాడి(సంతోష్‌)ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాని వయాకామ్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేస్తోంది. ఏపీ, తెలంగాణలో సినిమాని మా సంస్థ పంపిణీ చేస్తోంది. జీమ్యూజిక్‌ ఆడియో హక్కుల్ని చేజిక్కించుకుంది. నేను ఏ సినిమాకి పనిచేసినా ఆ సినిమాకి ముందుగా కథ నుంచి టీమ్‌తో పాలుపంచుకుంటాను. పాతరోజుల్లో నిర్మాత- పంపిణీదారుల మధ్య చక్కని అనుబంధం ఉండేది. కథను వివరించి, ప్రాజెక్టు గురించి చర్చించాక .. డబ్బులు ఎంత అవసరమో పంపిణీదారుల నుంచి అడిగి నిర్మాత తీసుకునేవారు. ఓల్డ్‌ ఫ్యాషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ పద్ధతి అది. ఇప్పటికీ ఆ పద్ధతినే అనుసరిస్తున్నా. ఇలా చేస్తోంది మేం మాత్రమేనేమో! ప్రస్తుతం సినిమాల‌ వ్యాపార సరళి మారుతోంది. ఇలా మార్పు వచ్చినప్పుడు ప్రతిసారీ పాత పద్ధతే బావుంది అనిపిస్తుంది. కానీ కాలంతో పాటే మార్పు. దాంతో పాటే మనం మారుతూ ముందుకు వెళ్లాలి. అప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకోగలం. పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకెళితేనే మనుగడ. కొత్త కుర్రాడు సంతోష్‌కి చక్కని భవిష్యత్‌ ఉంది. ట్యాలెంటుతో వచ్చిన హీరోల్ని ఆడియెన్స్‌ ఆదరిస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.

చిత్ర దర్శకుడు, నిర్మాత‌ పి.రామ్మోహన్‌ మాట్లాడుతూ -''అష్టాచెమ్మా చిత్రంతో విజయం అందుకుని ఏడేళ్లయ్యింది. చాలా కాలం పాటు నాయుడుగారితో, సురేష్‌ ప్రొడక్షన్‌తో పనిచేసిన అనుబంధం ఉంది. ఈ బ్యానర్‌లోనే నేను డైరెక్ట్‌ చేయడం అన్నది ఓ కల లాంటిది. 1996లో పరిశ్రమకి వచ్చాను. అప్పట్నుంచి సురేష్‌బాబుతో స్నేహం ఉంది. రామానాయుడు ఫిలింస్కూల్‌ విద్యార్థి సాయేష్‌ అనే కుర్రాడు ఈ కథ రాసుకున్నాడు. అమెరికా వెళ్లిపోతూ .. కథ ఇచ్చేస్తాను అని ఇచ్చేసి వెళ్లిపోతుంటే .. తనని తిట్టి ఈ కథను నువ్వే డైరెక్ట్‌ చెయ్‌ అన్నాను. కానీ అతడు వినకుండా వెళ్లిపోయాడు. నేనే డైరెక్ట్‌ చేశాను. ఇదో అర్బన్‌ రొమాంటిక్‌ కామెడీ. క్యూట్‌ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. సంతోష్‌ బెంగళూర్‌లో శిక్షణ తీసుకున్నాడు. గోల్కొండ హైస్కూల్‌ సినిమాకి నాతో కలిసి పనిచేశాడు. ఈ చిత్రంలో తను హీరోగా బాగా నటించాడు. ఈ సినిమాతో పెద్ద విజయం అందుకుంటాడు. అందరి ఆశీస్సులు కావాలి'' అన్నారు.

హీరో సంతోష్‌ మాట్లాడుతూ -''నటుడవ్వాలన్నది నా కల. సురేష్‌బాబుగారు, రామ్మోహన్‌గారు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాని, రాజ్‌తరుణ్‌ ప్రోత్సాహానికి థాంక్స్‌'' అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ -''అష్టాచెమ్మా బ్యానర్‌ అంటే నా సొంత టీమ్‌ ఇది. అందరూ నన్ను పిలిచి.. నిన్ను నటుడిని చేసిన నిర్మాత దర్శకుడవుతున్నారు. తనని ఇంట్రడ్యూస్‌ చేయవా? అని అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు తనని దర్శకుడిగా అందరికీ పరిచయం చేస్తున్నా. వరుసగా విజయవంతమైన సినిమాల్ని నిర్మిస్తున్న రామ్మోహన్‌గారు ఉన్నట్టుండి దర్శకుడవుతున్నారంటే ముందు కొంత సందేహించాను. కానీ ఈ సినిమాని ప్రివ్యూ చూపించారు. ఐదు నిమిషాల్లో సినిమాలో లీనమైపోయా. ఇదో క్యూట్‌ లవ్‌స్టోరీ. మూవీ చూశాక సంతోష్‌ నాకు చాలా బాగా నచ్చేశాడు. అష్టా చెమ్మాలో నేను చేసినదానికంటే చాలా బాగా చేశాడు ఈ చిత్రంలో. హీరో-దర్శకులకు 50-50 క్రెడిట్‌ ఇవ్వాలి. బాగా రాసుకున్న కథలో అంతే బాగా నటిస్తేనే సినిమా మెప్పిస్తుంది. అందుకే ఇలా చెబుతున్నా. కథానాయికగా అవికాగోర్‌ చాలా చక్కగా నటించింది. సినిమా చూస్తున్నంత సేపూ ట్విస్టులు, టర్నులు అనేవి లేకపోయినా చక్కని అనుభూతి కలుగుతుంది. స్మయిల్‌తో థియేటర్ల నుంచి బైటికి వస్తారు'' అన్నారు.

రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ -''నేను రామ్మోహన్‌గారిని కలిసినప్పుడు ఓ స్క్రిప్టు ఇచ్చి డైరెక్ట్‌ చేస్తావా? అన్నారు. అవును చేస్తాను అన్నాను. కానీ ఆయన నన్ను హీరోని చేశారు. పరిశ్రమలో ఆయన నాకు గాడ్‌ ఫాదర్‌. సినిమా గురించి సమస్తం తెలిసిన వ్యక్తి. ఈ సినిమా నేను చేయాల్సినది కాదు. సంతోష్‌ చేయాల్సినదే. అతడు బాగా నటించాడు. నేను నటించిన సినిమా చూపిస్త మావ చిత్రానికి ప్యారలల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. హిట్‌ కొట్టాల్సిన సినిమా ఇది. దర్శకత్వం, కెమెరా వర్క్‌ చాలా బావుంది. నీ సినిమా విషయంలో ఒకవేళ నా గెస్సింగ్‌ రాంగ్‌ అయితే నన్ను నేను కరెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రామ్మోహన్‌ మరిన్ని మంచి సినిమాలు చేయాలి. నాక్కూడా అవకాశం ఇవ్వాలి'' అన్నారు

వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సీవోవో అజిత్‌ అంధేర్‌ మాట్లాడుతూ -''సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇంటర్నేషనల్‌ స్థాయిలో మేం రిలీజ్‌ చేస్తున్నాం. సురేష్‌బాబు, రామ్మోహన్‌ వంటి వారితో కలిసి సినిమా ప్రొడక్షన్‌లో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మంచి కథ, కంటెంట్‌, క్యారెక్టర్లు, చక్కని నటీనటులతో పరిమిత బడ్జెట్‌లో సినిమాలు నిర్మించాలన్నది మా ప్లాన్‌. మాలాగే ఆలోచించే మరికొందరితో కలిసి టాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నాం. తను నేను చిత్రం ఓ చక్కని కామెడీ ఎంటర్‌టైనర్‌. చక్కని ప్రేమకథ ఉంది. దక్షిణాదిన అందరికీ నచ్చే చిత్రమిది. పెద్ద విజయం అందుకుంటామన్న నమ్మకం ఉంది'' అన్నారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి.

More News

చిరు మ‌న‌సు మార్చుకున్నాడా..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

పూరి మ‌రోసారి

త‌న కెరీర్ మొత్త‌మ్మీద డిసెంబ‌ర్ నెల‌లో ఒకే ఒక్క సినిమాతో ప‌ల‌క‌రించాడు అగ్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఉద్యోగ వేట‌లో షామిలి

'ఓయ్' బ్యూటీ షామిలి ఉద్యోగ వేట‌లో ప‌డింది. అయితే ఇదేదో నిజ‌జీవితానికి సంబంధించి అనుకోకండి.

త‌మ‌న్నాని హింస పెట్టిన కార్తీ

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని.. 'ఆవారా' కార్తీ హింస పెట్టాడా? అవున‌నే వినిపిస్తోంది కోలీవుడ్‌లో. అయితే ఇదేదో వ్య‌క్తిగ‌తంగా అనుకునేరు. కానేకాదు.

'ఊపిరి'లో అవి లేవ‌ట‌

సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించే అంశాల‌లో పాట‌ల‌కి, పోరాట స‌న్నివేశాల‌కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఫైట్ సీన్స్‌తో అస్స‌లు సంబంధం లేకుండా ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందుతోంది. అదే 'ఊపిరి'.