close
Choose your channels

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైనల్ ప్రకటన

Wednesday, January 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైనల్ ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటైనప్పటికీ అతికష్టమ్మీద టీడీపీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరాలని భావిస్తున్నట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కొందరు నేతలు ఇప్పటికే కారెక్కడంతో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కు చేరింది. ఖమ్మం జిల్లాలో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు.. మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలకనేతల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావు శిష్యులే. దీంతో ఆ ఇద్దర్ని కారెక్కిస్తే మనకు మేలు జరుగుతుందని తుమ్మల భావించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అశ్వరావుపేట నుంచి టీడీపీ తరఫున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు.. మాజీ మంత్రి తుమ్మలను కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మెచ్చా స్పందించి ఓ  ప్రకటన చేయడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.

మెచ్చా మాటల్లోనే...
కొన్ని మీడియా ఛానెళ్ళలో తాను మాజీమంత్రి తుమ్మలను కలిసి చర్చలు జరిపానని.. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని మెచ్చా ఖండించారు. "ఒక గిరిజన బిడ్డని అయిన నా రాజకీయ ఎదుగుదలకు మరియు నేను రాజకీయంగా ఉన్నత స్థాయికి రావటానికి ముఖ్య కారకులు తుమ్మల. నా రాజకీయ గురువు అయిన తుమ్మలను ఒక శిష్యుడిగా.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నాను. అందులో భాగంగానే తుమ్మలను కలవటం జరిగింది. అంతేతప్ప మా కలయికలో ఎటువంటి రాజకీయ కారణాలు ఏమీలేవు. నేను ఎప్పటికీ చంద్రబాబు విధేయుడినే.. నేను ఎప్పుడూ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం కుటుంబ సభ్యుడినే. నేను విలువలకు కట్టుబడి పనిచేసే వ్యక్తిని... నా ప్రాణం ఉన్నంత వరకు నేను తెలుగుదేశంలోనే ఉంటాను" అని మెచ్చా క్లారిటీ ఇచ్చారు. 

ఆ జాబితాలో చేరతారా..!!
నాగేశ్వరరావు ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఇలా ఒక మాట చెప్పి ఆ మరుసటి రోజే వేరే పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు మన తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. వెళ్తూ వెళ్తూ తిన్నగా నియోజకవర్గం అభివృద్ధి.. అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. అయితే మెచ్చా కూడా ఆ జాబితాలో చేరతారా..? లేకుంటే పార్టీని నమ్ముకుని.. తనను గెలిపించిన కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీడీపీలోనే కొనసాగుతారో తెలియాలంటే మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.