close
Choose your channels

చంద్రబాబు ఏపీ వచ్చేసరికి టీడీపీ ఖాళీ...!

Thursday, June 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు ఏపీ వచ్చేసరికి టీడీపీ ఖాళీ...!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో కుటుంబ సమేతంగా బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన అక్కడ బిజిబిజీగా ఉంటే.. ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మాత్రం పార్టీ మారే పనిలో బిజిబిజీగా ఉన్నారు. గురువారం ఉదయం నుంచి ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదని అయితే బీజేపీలోకి వెళ్లాలా..? లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకోవాలా..? అనే దానిపై నిశితంగా చర్చించారు. సమావేశం అనంతరం జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ అబ్బే.. టీడీపీని వీడే ప్రసక్తే లేదని తగిలీ తగలక మాట్లాడటం గమనార్హం.

అటు రహస్య భేటీలు.. ఇటు చేరికలు..!

మరోవైపు ఇప్పటికే.. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ రాత్రి లేదా అతి త్వరలోనే వీరంతా బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో అధికారికంగా చేరబోతున్నారు. ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుని కలిసి సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. మొత్తానికి చూస్తే గురువారం రోజున అటు కాపు నేతల సమావేశం.. ఇటు ఎంపీల చేరికతో దేశ వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి చర్చనీయాంశమైంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ ఉపాధ్యక్షుడు, కమలనాథుల్లో కీలకనేత అయిన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. "చంద్రబాబు యూరప్ ట్రిప్ ముగిసేలోపు ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. చాలా మంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. టీడీపీ నుంచి భారీగా బీజేపీలో చేరేందుకు నేతలు రెడీగా ఉన్నారు. బాబు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. టీడీపీనే కాకుండా కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు నేతలు రెడీ అంటున్నారు" అని విష్ణువర్థన్ రెడ్డి ఉన్నట్టుండి బాంబు పేల్చారు.

అయితే విష్ణువర్ధన్ వ్యాఖ్యలతో ఒక్క టీడీపీలోనే కాదు.. అటు జనసేన, ఇటు కాంగ్రెస్‌ నేతలు సైతం ఆలోచనలో పడ్డారు. అయితే ఎవరెప్పుడు గోడ దూకుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూస్తే మరో రెండు మూడ్రోజుల్లో ఏపీ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని తెలుస్తోంది. అయితే ఎవరు ఏ పార్టీలో ఉంటారో..? ఎవరు జంప్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.