విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Monday,April 12 2021]

కోవిడ్‌ సెకండ్ వేవ్ తెలంగాణలో విజృంభిస్తోంది. మూడు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించే స్థితిలో అయితే ప్రభుత్వం లేదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా కూడా ప్రజలు మాత్రం మాస్క్‌ను పెద్దగా ఉపయోగించడం లేదు. అధికారులు కోవిడ్ సెకండ్ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నప్పటికీ జనం పెడచెవిన పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్‌ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానాతో పాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌యాక్ట్‌-2005, ఐపీసీ సెక్షన్‌ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు అవసరమైన అధికారాలను ఇచ్చింది. జీవోను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.