close
Choose your channels

ఏపీలో ‘లోకల్ పంచాయతీ’.. ఏ క్షణం ఏం జరుగునో..!?

Tuesday, January 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ‘లోకల్ పంచాయతీ’.. ఏ క్షణం ఏం జరుగునో..!?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు పెద్ద రగడనే సృష్టిస్తున్నాయి. ఎలాగైనా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్.. ఎలాగైనా ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు ఏ క్షణం ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియకుండా ఉంది. గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. అప్పుడు ఎన్నికల వాయిదా వేసినందుకు రాత్రికి రాత్రే జీవో తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బదిలీ చేసింది. తరువాత ఆయన కోర్టును ఆశ్రయించడం తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ నాటి నుంచి ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వార్ జరుగుతూనే ఉంది.

ఇటీవల ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ తరుణంలోనే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉన్న కారణంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని స్పష్టం చేశారు. అయితే భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను నిమ్మగడ్డ విడుదల చేశారు. దీనిపై ప్రొసీడింగ్స్‌‌ను సైతం విడుదల చేశారు. ఇది కాస్తా ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని, ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఎస్‌ఈసీని నిలువరించాలని కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ గంగారావు.. ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొవిడ్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కలిగిస్తుందని అభిప్రాయపడింది. సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా రాష్ట్రప్రభుత్వం అందజేసిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని పేర్కొంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెంటనే డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. మంగళవారం ఉదయం 10.30 కు విచారణ జరుపుతామని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక హైకోర్టు జోక్యం చేసుకోజాలదని.. పూర్తయిన తర్వాత మాత్రమే సవాల్‌ చేయవచ్చని 2000వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్‌ఈసీ పిటిషన్‌లో పేర్కొంది. ఇక మున్ముందు దీనిపై ఏం జరుగుతుందో వేచి చూడాలి. మొత్తానికి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.