Telangana:తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. పాటించాల్సిన నిబంధనలు ఏమిటి..?

  • IndiaGlitz, [Monday,October 09 2023]

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాలంటే..

అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.

అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.

ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.

ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.

సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.

ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికార పార్టీయే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.

పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.

టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.

ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు .కొత్త పథకాలు ప్రకటించకూడదు.

శంకుస్థాపనలు చేయకూడదు .రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు ఎక్కువ డబ్బుతో ప్రయాణాలు చేయటం కుదరదు.

ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా అధికారులు సీజ్ చేస్తారు.

నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50వేలు మాత్రమే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

వైద్యం, కాలేజీ ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలి.

నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఫలితాలు..

ఇక తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా 20,892 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సగటున ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పింది. అలాగే 27,798 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది.