టీడీపీకి కీలకనేత గుడ్‌బై.. జగన్ చేర్చుకుంటారా!?

  • IndiaGlitz, [Friday,September 13 2019]

ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయాలను శాసిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో ‘సైకిల్‌’కు పంచర్లేసుకునేందుకు కూడా వీలులేకుండా పరిస్థితులు మారిపోయాయి. దీంతో.. ఆయా జిల్లాల్లోని కీలక నేతలు, రాజకీయ ఉద్ధండులు టీడీపీకి టాటా చెప్పేస్తున్నారు. ఎన్నికలకు ముందు పలువురు కీలకనేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్ జగన్ హయాంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ చేరికలు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీకి మరో ఊహించని షాక్ తగిలింది.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలకనేత తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను పార్టీ మారినా టీడీపీకి వచ్చిన నష్టం లేదన్న చంద్రబాబునాయుడు వ్యాఖ్యల వల్ల తీవ్ర మనస్తాపం చెందానని.. అందుకే తాను టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 18న జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులుతో పాటు పలువురు కీలకనేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా.. ఈయన తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం.

పార్టీలు ముఖ్యం కాదు..
‘ఎన్ని పార్టీలు మారానన్నది ముఖ్యం కాదు. అభివృద్ధే నాకు ముఖ్యం. ఇన్నాళ్లూ నాకు కార్యకర్తలు అందించిన సహకారం మర్చిపోలేనిది. గెలుపోటములతో ప్రస్తావన లేకుండా ప్రజల మనసు గెలిచాను’ అని తోట చెప్పుకొచ్చారు.

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా!?
ఇవన్నీ అటుంచితే తోట రాకను.. ఈయనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేతో పాటు.. పిల్లి సుభాష్‌ ఇంకా స్థానికంగా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కార్యకర్తలు మంత్రి పిల్లి కార్యాలయం ఎదుట, వైసీపీ కార్యాలయం ఎదుట ధర్నాలకు కూడా దిగారు. ఒక్క ఎమ్మెల్యేనే కాదు.. ఏకంగా మంత్రి కూడా ఈయన రాకను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆయన రాకను స్వాగతిస్తారా..? వ్యతిరేకిస్తారా..? లేకుంటే మరో నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అన్నదానిపై సర్వాత్రా చర్చనీయాంశమైంది. మరి తోట పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 18వరకు వేచి చూడాల్సిందే మరి.