close
Choose your channels

Toll Charges : పెరగనున్న టోల్ ఛార్జ్‌, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. అసలేంటీ టోల్ ఫీజు, ఎందుకు కట్టాలి..?

Friday, March 31, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశవ్యాప్తంగా వున్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి టోల్ ఫీజులు పెంచుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్రకటించింది. ప్రతి ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఎన్‌హెచ్ఏఐ టోల్ రుసుములను సమీక్షిస్తుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది టోల్ 5 నుంచి 10 శాతం మేర పెరగనుందని అధికారులు తెలిపారు. గతేడాది ఎన్‌హెచ్ఏఐ వివిధ రకాల వాహనాలకు పది నుంచి 15 శాతం మేర టోల్ పెంచింది. ఇప్పటికే అన్ని రకాల వస్తువులు, సేవలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ల ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా టోల్ రుసుము పెంపుతో ప్రయాణాలు చేయాలంటేనే భయపడే పరిస్ధితి నెలకొంది.

అసలేందుకు టోల్ కట్టాలి :

ఎన్‌హెచ్ఏఐ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థల సాయంతో దేశంలోని రాష్ట్రాల మధ్య జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మిస్తుంది. రోడ్డు వేసినందుకు కాంట్రాక్టర్లు చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి ఎన్‌హెచ్ఏఐ వారికి చెల్లిస్తుంది. ఇది కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది. అయితే రోడ్డు వేసేందుకు అయిన మొత్తం వ్యయం వసూలైన తర్వాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాల్సి వుంటుంది. జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్ వేలపై వున్న రెండు టోల్ బూత్‌ల మధ్య దాదాపు 60 కిలోమీటర్ల దూరం వుంటుంది. కొన్నిసార్లు ఆ దూరం తగ్గవచ్చు కూడా. దీనికి అనుగుణంగానూ ట్యాక్స్ వసూలు చేస్తారు. టోల్‌గేట్ల వద్ద టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అత్యవసర సేవలు అందిస్తారు.

ఫాస్టాగ్ విధానంతో భారీగా తగ్గిన రద్దీ :

నిన్న మొన్నటి వరకు నిర్దేశిత ప్రదేశంలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి రుసుము చెల్లించిన తర్వాతే వాహనాన్ని రహదారిపైకి అనుమతించేవారు. అయితే దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఫాస్టాగ్ తీసుకున్న వాహనం టోల్‌ప్లాజాకు సమీపంలో రాగానే అవసరమైన మొత్తం వాహనదారుడి ఖాతా నుంచి కట్ అవుతుంది. అనంతరం ఆటోమేటిక్‌గా గేట్ ఓపెన్ అవుతుంది. దేశంలోని సాధారణ ప్రజలంతా టోల్ కట్టాల్సిందే. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, సాయుధ బలగాలు, అంబులెన్స్‌లు, ఫైరింజిన్లకు మాత్రం మినహాయింపు వుంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.