టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు కథ ముగిసింది.. సెలిబ్రిటీలందరికీ క్లీన్ చిట్!

  • IndiaGlitz, [Tuesday,May 14 2019]

టాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపిన డ్రగ్ కేసు వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వరుసగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, నవపాద ధర్మారావ్(చిన్నా), నటి ఛార్మీ కౌర్, నటి ముమైత్ ఖాన్, హీరో రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), యంగ్ హీరో తనీష్, హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులను విచారించిన కొన్ని నెలలపాటు సిట్ అధికారులు విచారించారు.

అంతేకాదు అందుబాటులో లేనివారిని.. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో ముమైత్ ఖాన్‌కు సైతం నోటీసులిచ్చి బయటికి రప్పించి మరీ విచారించారు. వారి నుంచి గోర్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి వారి వాంగ్మూలాన్ని సైతం సిట్ బృందం నమోదు చేసింది. అలా మొత్తం 62 మంది పేర్లను సిట్‌ అధికారులు చార్జిషీట్లలో చేర్చారు. వీరిలో అందరూ.. హీరో, హీరోయిన్లు, దర్శకులే కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంలో అప్పట్లో సిట్ అధికారులు 12 కేసులను నమోదు చేశారు.

అందరికీ క్లీన్ చిట్!

రెండేళ్ల తర్వాత మరోసారి డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ బయటికొచ్చేశాయి. ఈ కేసులో ఉన్నవారంతా నిందితులు కాదు.. బాధితులే అని సెలబ్రిటీలపై సిట్ రిపోర్ట్ బయటికొచ్చింది. డ్రగ్స్ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు బయటపెట్టింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో సిని సెలబ్రిటీల పేర్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

ఈ నలుగురిపైనే ఛార్జి షీట్లు.. 

సిట్ అధికారులు ఛార్జిషీట్లు దాఖలు చేసిన నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పైన ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని ఆగస్టు 2017లో అరెస్ట్ చేశారు. మరొకటి జూలై 2017లో గంజాయి అమ్ముతున్నాడని ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన మణికొండలో నివాసము ఉంటున్న పి. రొన్సన్ జోసెఫ్ పై ఉంది. నిందితులను పట్టుకోవడంలోనూ.. సిట్ విచారణలో పారదర్శకత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసు బయటపెట్టిందెవరు..?

టాలీవుడ్ డ్రగ్ కేసులో విచారణ లోపభూయిష్టంగా ఉందని, కేసు నత్తనడక సాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జిజి) కార్యదర్శి పద్మనాభ రెడ్డి మే 1వ తేదీన రాసిన లెటర్లో పేర్కొన్నారు. డ్రగ్ వాడకం సినీరంగం నుంచి నెమ్మదిగా చాపకింద నీరులా కార్పొరేట్ విద్యారంగంలోకి విస్తరిస్తుందన్నారు.

విద్యార్థులు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుక పోకముందే డ్రగ్ మాఫియాపై తెలంగాణా ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని ఆయన ఆకాంక్షించారు. డ్రగ్ భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టి యువతను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో.. ఈ వ్యవహారం మున్ముందు ముందుకెళ్తుందా..? లేకుంటే ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా..? అనేది తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.