close
Choose your channels

Katragadda Murari : టాలీవుడ్‌లో మరో విషాదం... నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

Sunday, October 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీరి మరణాలను మరిచిపోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి మురారి కన్నుమూశారు.

ఇదీ కాట్రగడ్డ మురారి ప్రస్థానం:

కాట్రగడ్డ మురారి 1944 జూన్ 14న కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించారు. సినిమాలపై మక్కువతో డాక్టర్ చదువును మధ్యలోనే ఆపేసి మద్రాస్ చేరుకున్నారు. డైరెక్టర్‌ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు గాను కొందరు దర్శకుల వద్ద పనిచేశారు. అయితే డైరెక్షన్ వైపు కాకుండా అనుకోకుండా నిర్మాతగా మారారు. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. గోరింటాకు, నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకిరాముడు, సీతామహాలక్ష్మీ, శ్రీనివాస కళ్యాణం, జేగంటలు వంటి చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలలో సంగీతానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవారు మురారి. అందుకే ఆయన నిర్మించిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్సే. అన్నట్లు మురారి నిర్మించిన సినిమాలన్నీంటికీ కేవీ మహదేవన్ స్వరాలు అందించారు.

‘‘నవ్విపోదురుగాక’’ అంటూ ఆత్మకథలో సంచలన విషయాలు:

90వ దశకం తర్వాత చిత్ర నిర్మాణాన్ని పక్కనపెట్టేశారు. 2012లో ‘నవ్విపోదురుగాక’’ అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. ఇందులో చిత్ర పరిశ్రమలోని అనేక చీకటి కోణాలను కూడా ప్రస్తావించి సంచలనం సృష్టించారు. దర్శకుడు రాఘవేంద్రరావును సంస్కారహీనుడని మురారి పేర్కొనడంతో పాటు పలువురు హీరోల వ్యవహారశైలిపైనా ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. నిర్మాతపై నానాటికీ గౌరవం తగ్గిపోవడంతోనే తాను చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నట్లు మురారి తన ఆత్మకథలో పేర్కొన్నారు. అయితే ఈ పుస్తకం వివాదాస్పదం కావడంతో విక్రయాలను నిలిపివేశారు. మురారి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులకు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.