నేడు భారత్-కివీస్ మధ్య మ్యాచ్.. టాస్ గెలిచినోళ్లదే గెలుపు!

మాంచెస్టర్‌: అద్భుత విజయాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న భారత జట్టు ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. మరికాసేపట్లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన న్యూజిలాండ్‌తో తలపడనుంది. పేవరైట్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే.. మాంచెస్టర్‌లో తొలుత ఎవరు బ్యాటింగ్ దిగినవారికే గెలుపు అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌ టీమ్‌ ఓడిపోయింది.

కివీస్-భారత్ మ్యాచ్‌కు వరుణ గండం ఉంది.! వర్షం ఆటంకం కలిగిస్తే మ్యాచ్ రిజర్వ్‌డేకు కొనసాగించడం జరుగుతుంది. మ్యాచ్ ఆగిన చోటి నుంచే రిజర్వ్‌డే రోజు కొనసాగింపు జరగనుంది. అయితే రిజర్వ్‌డేలో సైతం మ్యాచ్ జరగకుంటే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుకే ఫైనల్‌ చేరే అవకాశం ఉంది. కాగా.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నా.. ఎప్పటి లాగే మిడిలార్డర్‌ బలహీనత వెంటాడుతోంది. టాపార్డర్‌ పుణ్యమా అని భారత్‌కు ఇప్పటిదాకా వచ్చిన ఇబ్బందేమీ లేకపోయింది. కానీ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తున్న కివీస్‌ను ఎదుర్కోవాలంటే మాత్రం అలసత్వం పనికిరాదు. మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాల్సిందేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు వరుసగా మూడు ఓటములతో సెమీస్‌ బరిలోకి దిగబోతున్న కివీస్‌.. భారత్‌కు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.

భారత్ బలాలు:

రోహిత్
కేఎల్ రాహుల్
కోహ్లీ ఫామ్‌లో ఉండటం
బూమ్రా
షమీ బౌలింగ్‌లో రాణిస్తుండటం

భారత్ బలహీనతలు:

ధోనీ, పాండ్యా ఫామ్‌లో లేకపోవడం
చాహల్, కుల్దీప్ ఆశిస్తున్న స్థాయిలో రాణించలేకపోవడం

కివీస్ బలాలు:

విలియమ్సన్, టేలర్‌ ఫామ్‌లో ఉండటం
గ్రాంథోమ్, నీషమ్ మిడిలార్డర్‌లో రాణించడం

కివీస్ బలహీనతలు:
గుప్తిల్, నికోలస్ ఫామ్‌లేమి
బౌల్డింగ్ బోల్డ్, ఫెర్గ్యుసన్‌లపై భారం

2003కు ముందు పరిస్థితి ఇదీ..!
ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా కివీస్‌ ఏడుసార్లు ప్రపంచకప్‌ సెమీస్‌ ఆడితే.. కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే (2015) గెలిచింది. భారత్‌ ఆరుసార్లు సెమీస్‌లో ఆడి మూడుసార్లు నెగ్గింది. వరల్డ్‌కప్‌లో మొత్తం ఎనిమిది సార్లు న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు వెళ్లింది. మరోవైపు సెమీస్‌లో మూడుసార్లు భారత్ ఓడింది. 1983, 2003, 2011 టోర్నీలో టీమిండియా ఫైనల్‌‌కు చేరింది. 1987, 1996, 2015 టోర్నీల్లో భారత్‌కు సెమీస్‌లో ఓటమి చెందింది. ప్రపంచకప్‌ చరిత్రలో మొత్తం ఏడుసార్లు భారత్-కివిస్‌లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్, మూడుసార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. 2003లో చివరిసారిగా కివిస్-భారత్‌లు తలపడ్డాయి. 1975, 1979, 1992,1999 టోర్నీల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. 1987 ప్రపంచకప్‌లో కివీస్‌తో రెండుసార్లు భారత్‌ గెలిచింది. 2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ నెగ్గింది. 2003 తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడడం ఇదే తొలిసారి.