Guntur Kaaram: గుంటూరు కారం కోసం ఎన్టీఆర్ ట్యాగ్‌లైన్ లేపేసిన త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

  • IndiaGlitz, [Thursday,June 01 2023]

కోట్లాది మందిని అలరిస్తూ.. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోన్న సంగతి తెలిసిందే. అయితే కొత్త కథలు కొన్ని సినిమాల్లోని మెయిన్ థీమ్‌ని ప్రేరణగా తీసుకుని కొత్తవి తీస్తున్నారు. కానీ సినిమాల పేర్లకు కూడా కరువు రావడంతో పాత సినిమాల పేర్లనే పెట్టేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల పేర్లే కాదు.. వాటి ట్యాగ్‌లైన్‌లను కూడా కాపీ కొట్టేయడమే ఇప్పుడు కొత్త వింత.

గుంటూరు కారంగా వస్తోన్న మహేశ్ :

అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో మహేష్ అభిమానుల సమక్షంలో 'ఎస్ఎస్ఎంబి 28' టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు.

సదరు గ్లింప్స్‌లో కర్రసాము చేస్తూ రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ మహేశ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. అంతా బాగానే వుంది కానీ.. మహేశ్ నోట్లో నుంచి స్టైల్‌గా బీడీ తీసి దానిని వెలిగించుకుంటూ వస్తారు. అంతేనా ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ త్రీడీలో కనపడుతుందా అంటూ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెబుతారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

రాఖీ సినిమాకు సేమ్ ట్యాగ్‌లైన్ :

ఇది పక్కనబెడితే.. గుంటూరు కారం మూవీ టైటిల్ కింద వాడిన ట్యాగ్‌లైన్ ఇఫ్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. గుంటూరు కారం సినిమా పేరైతే దానికి highly inflammable అన్నది ట్యాగ్‌లైన్. అయితే దీనిని ఆల్రెడీ మన తెలుగు సినిమాలోనే ఒకదానికి వాడేశారు. అది ఎవరిదోనో కాదు.. జూనియర్ ఎన్టీఆర్‌ది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తారక్ నటించిన ‘‘రాఖీ ’’ సినిమాకు ట్యాగ్‌లైన్‌గా highly inflammableను ఉపయోగించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు గుంటూరు కారంపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. గుంటూరు కారం అన్న పవర్‌ఫుల్ టైటిల్‌కి highly inflammable యాప్ట్ అవుతుంది కాబట్టి దీనిని వాడుకున్నారు కానీ .. రాఖీ సినిమా నుంచి దానిని లేపేయలేదని కొందరు మహేశ్‌కు మద్ధతుగా మాట్లాడుతున్నారు.

సంక్రాంతి కానుకగా గుంటూరు కారం :

ఇకపోతే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గుంటూరు కారంని విడుదల చేస్తామని ఇప్పటికే మేక్రస్ ప్రకటించారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి ప్రారంభంకానున్నట్లు ఫిలింనగర్ టాక్. దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరగనుంది.