close
Choose your channels

ఏపీలో ఎన్నికలకు ముందు కేంద్రం కీలక ప్రకటన.. కష్టాల్లో వైసీపీ!

Tuesday, March 9, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికలకు ముందు కేంద్రం కీలక ప్రకటన.. కష్టాల్లో వైసీపీ!

చివరి అస్త్రమిదే..

విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ అంశంపై వెనక్కి తగ్గేది లేదని వందకు వంద శాతం అమ్మి తీరుతామని పార్లమెంట్ వేదికగా కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఏపీ ఒక్కసారిగా భగ్గుమంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయింది. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు ‘రాజకీయాలు వద్దు.. బ్లేమ్ గేమ్ వద్దు. అందరం కలిసికట్టుగా పోరాడుదాం.. దీని పైన ఒక తమాషా ఆట జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి శిబిరంలో కూర్చోవాలి. రాజీనామా అనే చివరి అస్త్రాన్ని ప్రయోగించండి. రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే  కచ్చితంగా ఫలితం వస్తుంది’ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

కష్టమే కదా..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఈ ప్రకటన అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. విశాఖను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని పనులనూ పక్కనబెట్టి మరీ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం వైసీపీకి ప్రతిబంధకంగా మారనునున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలకతీతంగా పోరుబాటలో అధికార పార్టీ కూడా రంగంలోకి దిగితే ఫలితం మరోలా ఉండేది కానీ అధినేత, సీఎం జగన్ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో వైసీపీకి ఈ అంశం వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖను సొంతం చేసుకోవాలనుకున్న విజయసాయిరెడ్డి కల కలగానే మిగిలిపోనుందని తెలుస్తోంది. ఇప్పటికీ విశాఖ టీడీపీ చేతుల్లోనే ఉంది. అధికారంలో ఉండి కూడా వైసీపీ ఉత్తరాంధ్రను సొంతం చేసుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అంతే కాకుండా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో విశాఖ ఉక్కుకు సంబంధించిన కీలక అంశాల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూనే ఉన్నామని చెప్పడం గమనార్హం. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా విశాఖ ఉక్కు అంశం వైసీపీ మెడకు చుట్టుకుంటుందనడంలో సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం..

కాగా.. విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం సోమవారం స్పష్టం చేసింది. అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్లలో వాటాలను కూడా వ్యూహాత్మకంగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

కాగా.. ఈ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈక్విటీ లేదన్నారు. అయితే నిర్దిష్ట అంశాల్లో అవసరమైనప్పుడల్లా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని సోమవారం లోక్‌సభలో ఆమె తెలిపారు. వైసీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

ఊ కొట్టలేక...

ఎన్నికల అనంతరం ఈ ప్రకటన వస్తే పరిస్థితి ఎలాగుండేదో కానీ ఇప్పుడు మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా విశాఖ ఉక్కు అంశం వైసీపీకి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రస్తుతం అటు కేంద్రం ప్రకటనకు ఊ కొట్టలేక.. ఇటు ఉద్యోగులు, విపక్షాల పోరుబాట.. మరోవైపు సామాన్య ప్రజానీకం నుంచి సైతం వస్తున్న వ్యతిరేకతతో ఒక్కసారిగా వైసీపీ ఉలికిబాటుకు గురైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.