close
Choose your channels

‘కారు’దే జోరు.. కనిపించని ‘హస్తం’.. వాడిన ‘కమలం’!!

Saturday, January 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అదేదో సినిమాలో డైలాగ్‌లో మాదిరిగా.. ఎన్నికలు ఏవైనా సరే తెలంగాణలో ‘కారు’దే జోరు కనిపిస్తోంది. ‘కారు’ వేగానికి ‘హస్తం’ కనిపించకుండా పోగా.. ‘కమలం’ మాత్రం వాడిపోయింది!. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. ఇప్పటికే.. 120 స్థానాలున్న మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 108 స్థానాల్లో విజయపరంపర సాగించగా.. మరోవైపు కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితం అయ్యింది. మరోవైపు బీజేపీ మాత్రం సింగిల్ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. మరోవైపు స్వతంత్రులు మాత్రం ముగ్గురు గెలవడం గమనార్హం.

కేటీఆర్‌... సరిలేరు నీకెవ్వరు!
ఇక కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ కారు అదే జోరు కనిపించింది. మొత్తమ్మీద చూస్తే ‘కారు’తో కేటీఆర్‌తో ఓవర్ స్పీడ్‌తోనే దూసుకెళ్తూ.. సరిలేరు నాకెవ్వరు అంటూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో గులాబీ గుబాలించిన అనంతరం సీఎం కేసీఆర్ పెద్దగా ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొనలేదు. ఒకవేళ పాల్గొన్నా అంతంత మాత్రమే. మొత్తం భారాన్ని కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ మీదే మోపారు కేసీఆర్. నాటి నుంచి నేటి వరకూ మధ్యలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అన్నీ తానై కేటీఆర్ చూసుకున్నారని చెప్పుకోచ్చు. మరీ ముఖ్యంగా త్వరలోనే కేటీఆర్.. తెలంగాణ సీఎంగా పట్టాభిషేకం తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు డబుల్ పండగ చేసుకుంటున్నాయ్.!

గులాబీ పెద్దల స్పందన!
ఈ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. ‘2014 నుంచి చేస్తూ వస్తున్న అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. పురపాలక మంత్రిగా ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజానీకానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఎన్నికలు ఏవైనా సరే..!
మరోవైపు మంత్రి హరీశ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

ఎవరేమంటారో..!
ఇదిలా ఉంటే.. కారు జోరు ప్రదర్శిస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మొత్తానికి చూస్తే.. మీడియా ముందుకొచ్చే ఊదరగొట్టే కాంగ్రెస్, కమలనాథులు మాత్రం మాటలకే పరిమితం కాగా చేతల్లో మాత్రం చూపించిందేమీ లేదని తేలిపోయిందని ఈ ఫలితాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలున్న సొంత నియోజకవర్గాల్లో సైతం కోలుకోలేని షాక్‌లు తగలడం గమనార్హమని చెప్పుకొవచ్చు. అయితే ఈ ఫలితాలపై కేసీఆర్ ఏమంటారో..? కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మధ్యాహ్నం మూడు వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.