తెలంగాణలో ట్రంప్ విగ్రహం.. ఆశ్చర్యపోయిన జనం

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విగ్రహం తెలంగాణలో వెలిసింది. ఇదేంటి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కి అమెరికాలో అభిమానులుండటం కామన్.. మరి మన దేశంలో ఎందుకుంటారు..? అదీ మన తెలంగాణలో ఎందుకుంటారు..? అనేగా మీ సందేహం ఇక ఆలస్యమెందుకు ఈ వార్త చదివేయండి.. మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

తెలంగాణకు చెందిన బుస్సా కృష్ణ అనే వ్యక్తి ట్రంప్‌కు వీరాభిమాని. ట్రంప్ పుట్టిన రోజు జూన్-14. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరపుకున్నారు. అయితే జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ప్రత్యేక విగ్రహం ఏర్పాటు చేసి దానికి పాలాభిషేకం చేశారు. విగ్రహ ఏర్పాటుకి అందరూ తరలి రావాలని కూడా ఆహ్వానం పలికారు. ఆయన అభిమానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇదేంటి మీరు ఎందుకిలా చేస్తున్నారని అడిగితే.. ఒక్కమాటలో చెప్పాలంటే అగ్రరాజ్య అధ్యక్షుడంటే దేవుడి కంటే ఎక్కువని బదులిస్తున్నాడు. ట్రంప్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించాడు. అంతేకాదు.. ట్రంప్‌పై తనకున్న అభిమానంతో గతంలో రక్తదానాలు కూడా చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. ఇండియన్స్‌కు షాక్‌ల మీద షాకులిస్తున్న ట్రంప్‌కు ఈ రేంజ్‌లో వేడుకలు జరపడంతో కొందరు కృష్ణపై కన్నెర్రజేస్తుండగా.. మరికొందరు అభినందిస్తున్నారు.