close
Choose your channels

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే: టీటీడీ

Wednesday, April 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీరాముడికి అత్యంత ప్రియ భక్తుడైన ఆంజనేయుని జన్మ రహస్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీరామనవమి రోజున కీలక ప్రకటన చేసింది. అంజనీ సుతుని జన్మస్థలంగా తిరుమలని టీటీడీ కమిటీ నిర్ధారించింది. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాల ద్వారా హనుమంతుడు జన్మస్థలానికి సంబంధించిన ఆధారాలను నేడు టీటీడీ కమిటీ సమర్పించింది. ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆలోచనతో చిదంబరశాస్త్రి ఆధ్వర్యంలో మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, రామకృష్ణ తదితరులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 15న సమావేశమై చర్చించారు. అప్పటి నుంచి అనేక సార్లు కమిటీ సమావేశమై పరిశోధనలు చేసింది.

పురాణాలు, ఇతిహాసాలు, ఇన్‌స్క్రిప్షన్స్, జియోగ్రఫీతో పాటు ఇస్రో నుంచి శాస్త్రవేత్తల ద్వారా లాట్యుట్యూడ్స్, లాంగ్యిట్యూడ్స్ అన్నింటినీ పరిశీలించి ఆంజనేయుడి జన్మ స్థానం తిరుమలగిరే అని ధ్రువీకరించింది. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. అంజనాద్రిపై వెలసి ఉన్న జపాలి తీర్దమే హనుమంతుడి జన్మస్థలంగా కమిటి నిర్ధారించింది. కేంద్రీయ సంస్కృత వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మురళీధర శర్మ మాట్లాడుతూ.. మాతంగ మహర్షి సూచన మేరకు పుత్రుని కోసం అంజనీదేవి తిరుమల కొండపై తపస్సు చేసిందన్నారు. వాయుదేవుని కృపతో అంజనీ దేవికి ఇక్కడే హనుమంతుడు జన్మించాడని స్కంద పురాణంలో ఈ అంశం చాలా స్పష్టంగా ఉందన్నారు.

ఈ విషయమై 12వ శతాబ్దం నుంచి శ్రీవారి ఆలయంలో పఠిస్తున్న వెంకటాచల మహత్యం గ్రంథంలోనూ అంజనాద్రి ప్రస్తావన ఉందని మురళీధర శర్మ పేర్కొన్నారు. పలు శాసనాల్లోనూ అంజనాద్రి గురించి ఆధారాలు ఉన్నాయన్నారు. వరాహ పురాణంలో ప్రస్తావించిన వైకుంఠ గుహ తిరుమలలో ఉందని.. ఇక్కడే అంజనీదేవి ఆంజనేయునికి జన్మనిచ్చిందన్నారు. కర్ణాటకలోని హంపి హనుమంతుని జన్మస్థలం కాదని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయన్నారు. హంపిలో ఉన్నది కేవలం కిష్కింధ క్షేత్రమేనని మురళీధర శర్మ తెలిపారు. అక్కడ ఆంజనేయుడు జన్మించలేదన్నారు. జార్ఖండ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్రలలో కూడా కొన్ని ప్రాంతాలు ఆంజనేయుని జన్మస్థలంగా చెబుతున్నారని మురళీధర శర్మ తెలిపారు.

కానీ అవేవీ కూడా ఆంజనేయుడు పుట్టిన ప్రాంతం కాదని శాస్త్రీయంగా నిరూపించగలమన్నారు.
అంజనాద్రిలోని జాపాలి క్షేత్రమే హనుమంతుడి జన్మస్థలం అన్నది నిర్వివాదాంశమని మురళీధర శర్మ స్పష్టం చేశారు. ఇక దీనిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంజనేయుని జన్మస్థలం శోధించాలని తనకు వచ్చిన ఆలోచన దైవ నిర్ణయమన్నారు. శ్రీవారి కృపతోనే ఈ ప్రయత్నం జరిగిందన్నారు.ఇప్పుడు బుక్ లెట్ మాత్రమే విడుదల చేస్తున్నామన్నారు. సమగ్ర పుస్తకం రెండు మాసాల్లో భక్తులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.ఈ అంశంపై చర్చ జరగవచ్చని...కానీ దైవ నిర్ణయం అయితే ఎలాంటి వివాదాలు రావని భావిస్తున్నామని జవహర్‌రెడ్డి తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.