close
Choose your channels

మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

Wednesday, June 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంత వరకూ పాలకమండలికి రాజీనామా చేయని సభ్యులు, చైర్మన్‌లకు కాసింత వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. నామినెటెడ్ పదవులకు స్వతంత్రంగా రాజీనామా చేస్తే సరే లేకుంటే.. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తామని తేల్చిచెప్పేశారు. అది కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలోనే మంత్రి ప్రకటించారు. మంత్రి ఈ మాటలు మాట్లాడిన కొన్ని గంటల్లోనే టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

నాడు మొండి.. నేడు రాజీనామా..!

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పలువురు టీడీపీ నేతలు స్వతంత్రంగా తమ నామినెటెడ్ పదవులు వదులుకున్నారు. అంతేకాదు టీటీడీ పాలకమండలి సభ్యులు సైతం తప్పుకున్నారు. అందరూ ఇలా రాజీనామాలు చేస్తున్నప్పటికీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ మాత్రం మొండికేసి తాను రాజీనామా చేయబోనని.. దైవ సాక్షిగా ప్రమాణం చేశానని తననే చైర్మన్‌గా కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇందుకు స్పందించిన వైసీపీ నేతలు కొందరు.. మెడపట్టి బయటికి గెంటించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఎవరికి వారుగా.. హుందాగా రాజీనామా చేస్తే మంచిదని కాసింత ఘాటుగానే మాట్లాడారు.

ఇవ్వాల్సినోళ్లు ఇస్తేనే..!

ఇవాళ.. దేవదాయశాఖ మంత్రి తిరుమలను దర్శించుకుని అలా మీడియా ముందుకు వచ్చారో లేదో.. కొన్ని గంటల్లోనే పుట్టా రాజీనామా చేసేశారు. అంటే ఏదైనా చెప్పేవాళ్లు చెబితేనే.. ఇవ్వాల్సినవి ఇస్తేనా తిక్క కుదురుతుందా..? ఇప్పుడు బాగుంది కదా..? అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంకా పలువురు పలు నామినెటెడ్ పోస్టులకు రాజీనామా చేయలేదని.. వాళ్లకు కూడా బొట్టు పెట్టి మరీ చెప్పాలా..? అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మంచి రోజుకోసం సుబ్బారెడ్డి వెయిటింగ్!

కాగా.. టీటీడీ చైర్మన్‌గా వైఎస్ జగన్ బాబాయ్, వైసీపీ కీలకనేత, వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన.. వైవీ సుబ్బారెడ్డి పేరు కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చైర్మన్ పదవిపై ఇప్పటికే సుబ్బారెడ్డి కూడా స్పందిస్తూ నిజమేనని తేల్చారు. అయితే ఈ నెల చివరికల్లా నామినెటెడ్ పదవుల పంపకం జరుగుతుందని.. అప్పుడు సుబ్బారెడ్డి మంచి రోజు చూసుకుని టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.