close
Choose your channels

ఫోర్జరీ వివాదంపై క్లారిటీ.. తోటి చానెళ్లకు గడ్డిపెట్టిన టీవీ9 రవిప్రకాష్!!

Thursday, May 9, 2019 • తెలుగు Comments

ఫోర్జరీ వివాదంపై క్లారిటీ.. తోటి చానెళ్లకు గడ్డిపెట్టిన టీవీ9 రవిప్రకాష్!!

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌లో సంతకం ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన రెండ్రోజులుగా పరారయ్యారని పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా గందరగోళానికి గురయ్యేలా చేశాయి. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు టీవీ9 స్టూడియో నుంచి రవిప్రకాష్ క్లారిటీ ఇచ్చేశారు.

ధన్యవాదాలు..!

"ఇవాళ ఉదయం నుంచి అనేక వార్తలు తెలుగు ప్రజానీకాన్ని.. తెలుగు వీక్షకుల్ని గంధరగోళానికి గురిచేస్తున్నాయి. అదే విధంగా భారత మీడియా ప్రపంచంలో కూడా ఈ వార్తలు సంచలనాన్ని రేపుతున్నాయి. రవిప్రకాష్ రెండ్రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. నేను సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు.. నేను వేరే చానెల్‌కు నిధులు మళ్లించినట్లు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేయడం.. స్క్రోలింగ్‌లు నడపడం చేశారు. నామీద ఇంత కన్‌సర్న్ చూపించినందుకు.. సాటి చానెళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను టీవీ9 సీఈవోగా, ఫౌండర్‌గా హెడ్ క్వార్టర్స్ బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. గత పదిహేనేళ్లుగా నేను ఇక్కడే పనిచేస్తున్నాను. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో టీవీ9 ఒక స్పష్టమైన విజయకేతనాన్ని ఎగురవేసింది" అని రవిప్రకాష్ గుర్తు చేశారు.

జర్నలిజం అంటే మసాలా వార్తలు కాదు..!

"జర్నలిజం అంటే కేవలం మసాలా వార్తలు కాదు.. సమాజంలో మార్పు తీసుకురావాలని కష్టపడి టీవీ9 జర్నలిస్టులు ప్రజల దగ్గరికెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఇవాళ రవిప్రకాష్ గురించి వస్తున్న వార్తల వల్ల చాలా మందికి గందరగోళానికి గురయ్యారు. అమెరికా నుంచి నాకు.. మా స్టూడియోకు ఫోన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, టీవీ9లో అసలేం జరుగుతోంది..? అని కాల్స్ చేస్తున్నారు. ఏమీ ఆందోళన చెందాల్సిన విషయం లేదన్న సందేశాన్ని ఇవ్వడానికి నేను లైవ్ టెలికాస్ట్‌లో మీ ముందుకు వచ్చాను. చానెల్స్ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవాలకు సంబంధించిన వార్తలు ఇస్తే బాగుంటుంది. ఫలానా వ్యక్తి పారిపోయారు.. ఫలానా వ్యక్తిని ఉరితీశారు.. ఫలానా వ్యక్తిని జైల్లో పెట్టారు.. ఇటువంటి వార్తల వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు... ఇవన్నీ అవాస్తవమని ప్రజలు తెలుసుకుంటారు" అని రవిప్రకాష్ క్లారిటీ ఇచ్చారు.

కేసు నడిస్తోంది ఇదే..!

"ప్రస్తుతం ఎన్‌సీఎల్టీలో కేసు నడుస్తోంది. ఈనెల 16న ఎన్‌సీఎల్టీ కోర్టులో కేసు విచారణ జరగనుంది. ఆ వివాదాన్ని తీసుకుని కొంతమంది ఏవో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు.. తప్పుడు కేసులు నిలబడవ్.. అబద్ధాలు నిలబడవ్.. అవాస్తవాలు నిలబడవ్.. సత్యం మాత్రమే నిలబడుతుంది. మొన్నే టీవీ9 స్టూడియోలో వీక్షకులు నన్ను చూశారు. నిన్న బయట వేరే ఊరికి ప్రయాణం చేయడం వల్ల ఆఫీస్‌కు చేరుకోవడానికి కాస్త ఆలస్యమైంది. టీవీ9 ఎప్పటిలాగానే సామాజిక బాధ్యతతో వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంటుంది. ఎటువంటి తప్పుడు ఆరోపణలైనా.. తిప్పికొట్టి జర్నలిజానికి సంబంధించిన సరైన విలువలతో వార్త ప్రసారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది.. కాబట్టి పుకార్లు నమ్మొద్దు. మిత్రులు.. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం, ప్రచారం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు" అని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

తోటి చానెల్స్‌కు గట్టిపెట్టిన రవిప్రకాష్..!

"మీరు కొద్దిగా బాధ్యతాయుతంగా సరైన వార్తలను ప్రజలకు చూపించుంటే ఇంకా బాగుండేది. టీవీ9 గత పదిహేనేళ్లుగా నంబర్ వన్ స్థానంలో ఉంది. తెలుగు వీక్షకుల మనసులను గెలుచుకుంది. మీరు కూడా ఎక్కడో క్రెడిబులిటి అనే అంశం గురించి పనిచేసుంటే.. ఎవరో ఇచ్చిన ధనాన్ని ఉపయోగించి మీరు వార్తల తయారికి వాడకుండా ఉండుంటే మీ క్రెడిబులిటి పెరుగుండేది.. పారదర్శకత ఉండుండేది. మీ పట్ల కూడా ప్రజాభిమానం పెరిగుండేది అని నేను అనుకుంటున్నాను. మీరిచ్చిన తప్పుడు వార్తలకు ధన్యవాదాలు.. మీరు భవిష్యత్తులోనైనా క్రెడిబుల్ న్యూస్ ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాను. రవిప్రకాష్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. చేయబోరు.. కొంతమంది కొన్ని తప్పుడు ఆరోపణలు పెట్టడానికి ప్రయత్నించారు.  నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది.. ఇవాళ అదే జరిగింది. మేమెప్పుడు జర్నలిజంకు సంబంధించిన విలువల కోసం మేమెప్పుడు నిలబడతాం.. భవిష్యత్తులోనూ నిలబడతాం. జర్నలిజం విలువలను సమున్నతంగా నిలుపుతూ.. జర్నలిజం అంటే సామాజిక బాధ్యత అని అంశాన్ని మా మనసుల్లో నింపుకొని తెలుగు ప్రజలకు సేవచేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం.. అందరకీ ధన్యవాదాలు. ఈ గందరగోళాన్ని కాస్త తగ్గించడానికే నేను మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాను" అని రవిప్రకాష్ తోటి చానెళ్లకు గట్టిగా గడ్డిపెట్టారు.!. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా లేకుంటే మరింత ముదురుతుందా అనేది వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz