close
Choose your channels

అబద్ధాల రవిప్రకాష్... 11 అసలు నిజాలు బయటపడ్డాయ్! 

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీవీ9 వివాదంలో పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిది నిమిషాలకుపైగా నిడివి గల ఈ వీడియోలో అసలు కేసులు సంగతేంటి..? కొత్త యాజమాన్యం టీవీ9ను ఎలా కొన్నది..? అసలు ఈ వివాదానికి కారకులు ఎవరు..? పోలీసులు తనపట్ల ఎలా వ్యవహరిస్తున్నారు..? లోగో వివాదమేంటి..? ఇలా సుమారు 11 విషయాలను రవిప్రకాష్ ప్రస్తావించారు. అయితే ఈ విషయాలన్నింటికీ టీవీ9 కొత్త యాజమాన్యం స్పందిస్తూ కౌంటర్‌గా అసలు నిజాలు 11 అంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు బయటపడటం గమనార్హం.

కొత్త యాజమాన్యం విడుదల చేసిన ప్రకటన యథావిథిగా...
అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు

నాయినా.. రవిప్రకాశ్...ఎక్కడున్నావో తెలియకపోయినా.. మొత్తానికి ఒక వీడియో పోస్ట్ ద్వారా జనం ముందుకు వచ్చి, నీ ఆక్రోశాన్ని బాగానే చూపించావు. ఈ వీడియో పోస్టు ద్వారా నువ్విచ్చిన ఉపన్యాసంలో నువ్వు లేవనెత్తిన అంశాలకు కాస్త సమాధానం వెతుక్కో నాయినా... అన్నింటికీ బరితెగించి నువ్వు చేస్తున్న అసత్య ప్రచారానికి.. అసలు సమాధానాలేంటో చూద్దాం..

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-1

టీవీ9 సంస్థ గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల క్రితం నేను ఈ సంస్థను ప్రారంభించాను. నాకు బయట నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్గా శ్రీనిరాజు వచ్చి మద్దతు ఇచ్చారు. ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చారు. సంస్థను నడపమని చెప్పారు.

అసలు నిజం

నాయినా.. రవిప్రకాశ్, టీవీ9 సంస్థను స్థాపించింది నువ్వు కాదు. శ్రీనిరాజు అనే వ్యాపారవేత్త వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా టీవీ9ను స్థాపించి, నీకు సీఈవోగా ఉద్యోగం ఇచ్చారు. స్టాక్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. నీలాగా, మరికొందరికీ డైరెక్టర్ స్థాయి హోదాలు ఇచ్చారు. ఆ సంస్థలో పెట్టిన పెట్టుబడి మొత్తం శ్రీనిరాజుకు సంబంధించినదే. నీకు ఉందని చెప్పుకుంటున్న వాటాలో అత్యధిక భాగం నీకు స్టాక్ ఆప్షన్స్ రూపంలో వచ్చిందే. నీకే కాదు, ఇతర కీలక ఉద్యోగులకూ ఇలానే శ్రీనిరాజు స్టాక్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి గుర్తు తెచ్చుకో. అంతేకాదు, మరే మీడియా సంస్థలో ఉన్నతోద్యోగులకు లేనంత స్థాయిలో నీకు జీతభత్యాలు, బోనస్‌లు చెల్లించారు. టీవీ9 సీఈవోగా నీకు గుర్తింపు వచ్చి ఉండొచ్చు, కానీ టీవీ9 సక్సెస్ వెనుక వందలాది మంది ఉద్యోగుల కష్టం, ప్రమోటర్ల పెట్టుబడి ఉన్నాయని మరవొద్దు.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-2

శ్రీనిరాజు గారు లాభాలతో బయటకు వెళ్లదల్చుకున్నారు. ఆయన్ను లాభాలతో బయటకు వెళ్లనివ్వండి అని చెప్పి, నేను ఒక్క రూపాయి లాభం ఆశించకుండా, ఒక్క రూపాయి ప్రయోజనం ఆశించకుండా టీవీ9 ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ డీల్ను చేయాలని సంకల్పించాను.

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్, టీవీ9 యాజమాన్యం బదిలీ జరగడానికి ముందు, బదిలీ జరిగిన తర్వాత, నువ్వు టీవీ9 సంస్థ నుంచి జీతం కాకుండా, వివిధ రూపాల్లో పొందిన ఆర్థిక ప్రయోజనం ఎంతో ఒక్కసారి లెక్కవేసుకో. టీవీ9 కంటే మించి లాభాల్లో ఉండే ఎన్ని కంపెనీల్లో ఒక సీఈవోకి ఇంత ప్రతిఫలం దక్కిందో నీ అంతరాత్మను ఒక్కసారి అడుగు. నీ బ్యాంక్ అకౌంట్‌ని ఒక్కసారి చూసుకో. టీవీ9 సీఈవోగా ఉన్న 15 ఏళ్ల కాలంలో నువ్వు కూడబెట్టిందేంటో నీకే తెలుస్తుంది. నిజం నీ కళ్లు తెరిపిస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-3

మెఘా కృష్ణారెడ్డి గారు తన స్నేహితులతో కలిసి, ఆయన పెట్టుబడితో టీవీ9 సంస్థలోకి వస్తారని నేను ఆశించాను. కానీ నేను ఆశించింది ఒకటి, జరిగిందొకటి. మెఘా కృష్ణారెడ్డిగారి స్థానంలో మెజార్టీ వాటాదారుడిగా రామేశ్వరరావు టీవీ9 సంస్థ అయిన ABCLలోకి వచ్చి చేరారు.

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్, రామేశ్వరరావు టీవీ9 సంస్థలో ప్రధాన వాటాదారనే విషయం ఒప్పందానికి ముందు నిజంగా నీకు తెలియకపోతే, ఆ ఒప్పందంపై సంతకం ఎలా చేశావు? ఎందుకు చేశావు? కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత టీవీ9 సంస్థలో కొత్త వాటాదార్ల వివరాలన్నింటినీ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు ఎందుకు పంపించావు? ఎలా పంపించావు? టీవీ9 హిందీ చానల్ భారత్‌వర్ష ప్రారంభించడానికి కావల్సిన రూ.70 కోట్ల మూలధనాన్ని రామేశ్వరరావు నుంచి తీసుకున్నప్పుడు నీకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఆ పెట్టుబడే లేకపోతే, నువ్వు హిందీ చానల్ ప్రారంభించగలిగేవాడివా? 90 శాతానికిపైగా ఉన్న వాటాదారులు కాకుండా, టీవీ9 సంస్థకు నేనే అధిపతినంటూ ఢిల్లీలో డబ్బా కొట్టుకున్నప్పుడు నీకు ఎలాంటి విలువలు గుర్తురాలేదు. సంస్థ నిర్వహణలో నియమ నిబంధనలను, పద్ధతులను, పారదర్శకతను పాటించాలని కోరినప్పుడు మాత్రమే రామేశ్వరరావుతో నీకు ఇబ్బంది ఎదురయ్యింది.

కొత్త యాజమాన్యం తరపున డైరెక్టర్లు బోర్డులోకి రావాలని నిర్ణయం జరిగినప్పుడు, నీ అవకతవకలు బయటపడతాయన్న భయం నీకు పట్టుకుంది. 8 శాతం వాటాతో వంద శాతం ఫలితాలను సొంతం చేసుకోవాలని, సంస్థను ఇష్టారాజ్యంగా నడపాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఇక సాగవని తెలిసిన రోజునే నీకు జర్నలిస్ట్ విలువలు గుర్తుకొచ్చాయి.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-4

మనిద్దరి మధ్యలో ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది చట్టరీత్యా అవసరం. చట్టం చెబుతోంది, ఒక మెజార్టీ షేర్ హోల్డర్ వచ్చి, ఒక మైనార్టీ షేర్ హోల్డర్ ఉన్న కంపెనీలో చేరినప్పుడు ఇద్దరి మధ్యా ఒప్పందం, ఒడంబడిక కచ్చితంగా కావాలి.

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్, కంపెనీల చట్టంలో నిబంధనల ప్రకారం, మెజార్టీ వాటాదార్ల నిర్ణయమే చెల్లుతుంది. కంపెనీల చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా... ఈ విషయం నీకు తెలిసి ఉండేది. నువ్వు కోరుకునే షేర్ హోల్డర్ల ఒప్పందం అంటే... 90 శాతం వాటా దారులు కంపెనీ మొత్తాన్ని నీ ఇష్టారాజ్యానికి వదిలేసి, నీకు అన్ని విషయాల్లోనూ వీటో పవర్ ఇవ్వడమా.. ? ఇలాంటి షేర్ హోల్డర్ల ఒప్పందాన్ని ఎక్కడైనా చూశావా..? టవీ9ను నడిపిన 15 ఏళ్లలో వాటాదార్ల అనుమతి లేకుండా, నువ్వు నీ వందమాగధుల సంతకాలతో సంస్థ నుంచి ఎన్ని డబ్బులు కొట్టాశావో లెక్కలు తేలే రోజులు రావడంతోనే, నిన్ను నువ్వు కాపాడుకోవడానికే నీకు ఒప్పందాలు గుర్తుకువచ్చాయి.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-5

రవిప్రకాశ్-శివాజీ ఒక ప్రైవేటు ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రైవేటు ఒప్పందానికి సంబంధించి రామేశ్వరరావు బంధువు వచ్చి ఒక కేసు పెడతారు.

అసలు నిజం

నాయినా రవిప్రకాశ్... సదరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి టీవీ9 సంస్థలో డైరెక్టర్. అదే విషయాన్ని కొన్ని నెలల ముందు స్వయంగా నువ్వే ఎంఐబీకి తెలియజేశావు. కాస్త గుర్తు తెచ్చుకో. పాత తేదీలతో ఫోర్జరీ ఒప్పందాలు కుదుర్చుకుని, కొత్త యాజమాన్యానికి అడ్డంకులు కల్పిస్తుంటే, ఆ యాజమాన్య సంస్థ తరపున, ఆ సంస్థ డైరెక్టర్ హోదాలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పా.. ? ఇదే తప్పయితే, ఆధారాలతో సహా పట్టుబడ్డ నీ అడ్డగోలు ఫోర్జరీలను ఏమనాలి? దబాయించడంలో ఆరితేరిపోయిన నీకు, చట్టప్రకారం చేసేవన్నీ అడ్డగోలుగానే కనిపిస్తుంటాయి కాబోలు. పోలీసుల ముందుకు వెళ్లి ఆ ఆధారాలన్నింటినీ ఒక్కసారి చూసుకుంటే, నిజం ఏంటో నీకే తెలుస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-6

రవిప్రకాశ్ దగ్గర పనిచేస్తున్న ఒక పార్ట్టైమ్ ఎంప్లాయ్ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని, రవిప్రకాశ్ ఫోర్జరీ చేసి, అతని రాజీనామా లేఖను అప్లోడ్ చేశారని

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్, దేవేందర్ అగర్వాల్ అనే వ్యక్తి టీవీ9 సంస్థలో కంపెనీ సెక్రటరీ హోదాలో, కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం నియమితమైన పూర్తి స్థాయి ఉద్యోగి. ఆ విషయాన్ని కాస్త తెలుసుకో. కంపెనీల చట్టంలో ఈ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయి.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-7

దేవేందర్ అగర్వాల్ సిగ్నేచర్‌ను రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారన్న ఒక తప్పుడు క్రిమినల్ కేసును పెట్టే ప్రయత్నం చేశారు.

అసలు నిజం

నాయినా రవిప్రకాశ్... ఈ విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీనే స్వయంగా అదే రోజు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. తాను రాజీనామా చేయకున్నా, రాజీనామా చేసినట్లు, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సదరు కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అబద్ధాలు మూటగట్టడంలో బిజీబిజీగా ఉన్న నువ్వు కాస్త ఈ నిజాన్ని గుర్తు తెచ్చుకో.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-8

టీవీ9 లోగో ఆథర్ ఈజ్ రవిప్రకాశ్. టీవీ9 లోగోను సృష్టించింది రవిప్రకాశ్. టీవీ9 లోగో యజమాని రవిప్రకాశ్

అసలు నిజం

నాయినా రవిప్రకాశ్.. టీవీ9 లోగోను సృష్టించింది నేనేనని చెప్పుకుంటున్న నువ్వు... ఇందుకు సంబంధించి కాపీరైట్ చట్టంలోని నిబంధనలను కాస్త చదువుకో. ఈ చట్టం ప్రకారం లోగోను డిజైన్ చేసిన, లేదా చేయించిన వ్యక్తి ఆథర్ అవుతారు. అన్నిరకాల కాపీరైట్స్ కు ఇదే నిబంధన వర్తిస్తుంది. ఒక ఉద్యోగిగా కంపెనీ జీతం తీసుకుని నువ్వు చేసింది ఇదే. తరువాత అదే లోగోను, కంపెనీ పేరు మీద అసైన్ చేస్తూ ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ సంస్థల అధికారులకు ఎన్నో ఏళ్లక్రితం నీ అంతట నీవే అన్ని పత్రాలను సమర్పించావు. ఏ కాపీరైట్ విషయంలోనైనా జరిగేది ఇదే పద్ధతి. టీవీ9 లోగోలు మొదట్నుంచీ కూడా ABCL పేరుమీదే ఉన్నాయి తప్ప, రవిప్రకాశ్ అన్న పేరు మీద లేవన్న విషయాన్ని కాస్త గుర్తు తెచ్చుకో. లోగోను ఫోటోషాప్‌లో డిజైన్ చేసిన గ్రాఫిక్ ఆర్టిస్టు ఈ లోగో నాదే అంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. నీ వాదన కూడా అలానే ఉంది.

ఇన్నేళ్లూలేని కాపీరైట్ యాజమాన్య హక్కు ఇప్పుడెందుకు నీకు గుర్తుకొచ్చింది నాయినా.. వందల కోట్లు ఖర్చుపెట్టి 2018 ఆగస్టులో నీ కంపెనీలో 90 శాతానికి పైగా వాటాను కొత్త యాజమాన్యం కొనుగోలు చేస్తే, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నువ్వు... ఇది జరిగిన తర్వాత నాలుగు నెలలకు, అంటే డిసెంబర్ 31, 2018న, దొంగచాటుగా టీవీ9 లోగోల కాపీరైట్‌ను వేరేవారికి బదలాయించే ప్రయత్నం చేయడం, నువ్వు నమ్మే విలువల్లో భాగమా.. ? NCLTలో పిటిషన్‌ను అడ్డు పెట్టుకుని... ఇద్దరు వ్యక్తుల మధ్య 40 వేల షేర్ల మార్పిడి కుదరదంటూ నానా హంగామా సృష్టించిన నువ్వు, ఏకంగా కంపెనీకి బ్రాండ్ అయిన టీవీ9 లోగోలను కేవలం రూ.99 వేలకు అమ్మే ప్రయత్నం చేయడం నీకున్న అతితెలివితేటలకు నిదర్శనం కాదా?

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-9

ఈరోజు, నాముందున్న ప్రధానమైన సమస్య, నేను విలువల్ని పాటించాలా, ఈ రోజు దాకా ఏ విలువల గురించైతే మాట్లాడానో, ఏ జర్నలిజం గురించైతే మాట్లాడానో, ఏ సమాజ హితం గురించైతే మాట్లాడానో, ఆ విలువల కోసం నేను పనిచేయాలా...

అసలు నిజం

నాయినా... రవిప్రకాశ్, విలువల గురించి నువ్వు మాట్లాడుతుంటే... దొంగే దొంగని అరిచినట్లుగా అందరికీ అనిపిస్తోంది. ఈ విషయం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. జర్నలిస్టునని చెప్పుకుంటూ, సంస్థను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు, సాగించిన అక్రమాలు వేలల్లో ఉన్నాయి. ఆ బాధితులందరూ నీ ముందుకు వస్తే, నీ విలువలేంటో నీకు తెలిసొస్తుంది.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-10

కొంతమంది ధనిక స్వాముల బలానికి భయపడి వారికి, వారి దొంగ కేసులకు భయపడి, నేను పూర్తిగా వారికి ఊడిగం చేస్తుండాలా?

అసలు నిజం

నాయినా.. రవిప్రకాశ్, టీవీ9లో చేరకముందు నీ జీతం ఎంత, నీ ఆస్తులు ఎంత, చేరాక నీ జీతం ఎంత, నీ ఆస్తులు ఎంత.. విదేశాల్లో నీకున్న వ్యాపారాలేంటో, ఒక్కసారి లెక్కలు వేసుకుని చూస్తే, నువ్వు ధనికస్వామివో, సగటు జర్నలిస్టువో ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి తెలివితక్కువ వాదనలు ముందుకు తెచ్చినంత మాత్రన నీ నిజస్వరూపం ఎవరికీ తెలియదని భ్రమపడకు.

రవిప్రకాశ్ అసత్య ప్రచారం-11

నేను అనుకునేది, భవిష్యత్ తరాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే, భవిష్యత్ తరాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే, భవిష్యత్ తరాలు మనల్ని తల ఎత్తి చూడాలంటే, జీవితంలో విలువలు తప్పనిసరి.

అసలు నిజం

నాయినా రవిప్రకాశ్.. సమాజం పట్ల నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు. వినడానికి కూడా సిగ్గేస్తోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదనుకుంటున్నట్లుగా ఉంది నీ వ్యవహార శైలి. టీవీ9 అమ్మకం పూర్తైన తర్వాత ఉద్యోగులకు పంచమంటూ ఇచ్చిన రూ.12 కోట్లను నువ్వే విధంగా పంచావో, ఎంతమందికి అందించావో ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, నీ సహోద్యోగుల పట్ల, సహ జర్నలిస్టుల పట్ల నువ్వు పాటించిన విలువలు ఎంత గొప్పవో నీకే తెలుస్తుంది.

“వంద కళేబరాలను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు గల్లంతైనట్లు” అనే సామెత నీకు బాగానే తెలిసి ఉంటుందనుకుంటా... బహుశా, నీ విషయంలో ఇది బాగా వర్తిస్తుందేమో... ఇకనైనా గాలి కబుర్లు మాని, చట్ట ప్రకారం వ్యవహరించు నాయినా.. ! అని రవిప్రకాష్ వీడియోకు కౌంటర్‌గా కొత్త యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే కొత్త యాజమాన్యం కౌంటర్‌పై రవిప్రకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.