శ్రీలంక మారణహోమంలో ఇద్దరు జేడీఏస్ నేతలు మృతి

  • IndiaGlitz, [Monday,April 22 2019]

వరుస బాంబు పేలుళ్లతో కొలంబోవాసులు కకావికలమయ్యారు. ఈస్టర్ డే నాడు జరిగిన ఈ మారణహోమంలో సుమారు 300మందికి పైగా మరణించగా.. అంతకు మూడు రెట్లు మందికి గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరెవరు చనిపోయారు..? ఎవరెవరికి గాయాలయ్యాయి..? అనే విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారని ఫొటోలు కూడా బయటికొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా.. కర్ణాటకలోని జేడీఎస్‌కు చెందిన ఏడుగురు నేతలు కొలంబోలో అదృశ్యమయ్యారని... వారిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జేడీఎస్ నేతలు, సీఎం కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. ఇటీవల కర్ణాటకలో జరిగిన రెండో విడత ఎన్నికలకు గాను ప్రచారం ముగిసిన అనంతరం ఏడుగురు నేతలు ఈనెల 20న శ్రీలంకకు వెళ్లారు. వీరంతా ద షాంగ్రిల్లా హోటల్‌‌లో బస చేశారని సమాచారం. అయితే ఆ హోటల్‌లోనే బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ ఏడుగురిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా షాంగ్రిల్లా హోటల్‌లో పేలుళ్లు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఎక్కడికక్కడ జనాలు పరుగులు తీశారు. మరోవైపు కొలంబోలో హైఅలర్ట్ ప్రకటించడంతో జనాలు బయటికి కూడా రావట్లేదు. దీంతో ఎవరెక్కడున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే భారతీయులను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది.