Download App

Umamaheswara Ugraroopasya Review

లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమా చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు డిజిట‌ల్ మాధ్య‌మాలే ప్ర‌ధాన సాధ‌నాలుగా మారిపోయాయి. ఓటీటీల కార‌ణంగా ప్రేక్ష‌కుడుకి ఓ త‌ర‌హా సినిమానే చూడాల‌ని కాకుండా ప‌లు ర‌కాల భాష‌ల్లో మంచి చిత్రాల‌ను చూసే అవ‌కాశం క‌లుగుతుంది. స‌ద‌రు మాధ్యమాలు కూడా ఇత‌ర భాష‌ల్లోని మంచి చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. మ‌రికొన్ని సినిమాలు థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డం వ‌ల్ల డిజిట‌ల్ మాధ్య‌మాల్లో విడుద‌ల‌వుతున్నాయి. అలా నేరుగా డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌లైన చిత్ర‌మే ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్రరూప‌స్య‌’. తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్‌ను నిర్మించిన ఆర్కామీడియా మ‌రో నిర్మాణ సంస్థ మ‌హాయాణ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. మ‌ల‌యాళ చిత్రం ‘మహేశింతే ప్రతీకారమ్’కు తెలుగు రీమేక్. సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకట్ మహ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...

క‌థ‌

అర‌కులో ఉండే మ‌హేశ్‌(స‌త్య‌దేవ్‌) ఓ చిన్న ఫొటో స్టూడియో న‌డుపుతూ ఉంటాడు. త‌న‌కు వ‌చ్చిన స్టైల్లో ఫొటోలు తీస్తుంటాడు. అక్క‌డ త‌ను త‌ప్ప మ‌రొక‌రు ఉండ‌రు కాబ‌ట్టి త‌న స్టూడియోకు జ‌నాలు వ‌స్తుంటారు. మ‌హేశ్ త‌న తండ్రి(రాఘ‌వ‌న్‌)తో క‌లిసి జీవ‌నం సాగిస్తుంటాడు. త‌న‌తో పాటు నాటువైద్యం చేసే బాబ్జీ(వి.కె.న‌రేశ్‌)తో మంచి అనుబంధం ఉంటుంది. బాబ్జీ ద‌గ్గ‌ర సుహాస్ ప‌నికి కుదురుతాడు. సుహాస్ స‌ర‌దాగా ఉండే మ‌నిషి కావ‌డంతో మ‌హేశ్‌కి, త‌న‌కు కూడా మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. ఓసారి అనుకోకుండా జ‌రిగిన గొడ‌వ‌లో ఓ జోగ్‌నాథ్ అనే రౌడీ మ‌హేశ్‌ని అన‌వ‌స‌రంగా కొడ‌తాడు. జోగ్‌నాథ్‌ని కొట్టే వ‌ర‌కు చెప్పులు వేసుకోన‌ని శ‌ప‌థం చేస్తాడు మ‌హేశ్‌. ఊర్లో అవ‌మానాల‌ను ఎదుర్కొంటాడు. జోగ్‌నాథ్ దుబాయ్ వెళ్లిపోతాడు. మ‌హేశ్ మాత్రం జోగ్‌నాథ్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఈలోపు మ‌హేశ్ ప్రేమించిన అమ్మాయి స్వాతి(హ‌రి చంద‌న‌) మ‌రొక‌రిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. జోగ్‌నాథ్ చెల్లెలు జ్యోతి(రూపా కొడ‌వ‌యూర్‌)తో మ‌హేశ్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంతకూ జోగ్‌నాథ్ ఇండియా వ‌స్తాడా? మ‌హేశ్ ప్ర‌తీకారం తీరిందా?  అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ప‌ర‌భాషా చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డం ఎప్ప‌టి నుండో జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌. ప్ర‌స్తుతం కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో రీమేక్ చిత్రాల‌ను చేయ‌డానికి మ‌న హీరోలు కూడా ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘మ‌హ‌శింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ పేరుతో రీమేక్ చేశారు. తొలి చిత్రం ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’తో హిట్ అందుకున్న దర్శకుడు వెంకట్ మహ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. బాహుబ‌లి నిర్మాత‌లు, మంచి యూనిట్ కుద‌ర‌డంతో సినిమాపై కాసింత ఆస‌క్తి పెరిగింద‌న‌డంలో సందేహం లేదు.

వెంక‌ట్ మ‌హ సినిమాను నేచుర‌ల్‌గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న ప్ర‌య‌త్నం తెర‌పై క‌న‌ప‌డ‌తుంది. అలాగే సినిమా అంతా ఏదో సాధార‌ణ క‌థ‌లా, కొన్ని ఎమోష‌న్స్ చుట్టూ న‌డిచే సినిమాగా మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇక ప్రేక్ష‌కులు, ఇండ‌స్ట్రీ అటెన్ష‌న్ పెరిగింద‌ని భావించాడేమో కానీ.. వెంక‌ట్ మ‌హ మ‌ల‌యాళ వెర్ష‌న్‌ను అలాగే తీశాడు. దీంతో మ‌ల‌యాళంలో స్లో టెంపో తెలుగులోనూ కంటిన్యూ అయ్యింది. అయితే స్లో నెరేష‌న్ అనేది తెలుగు ప్రేక్ష‌కుడిని కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. స‌న్నివేశాలు సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తాయి.  అలాగే హీరో పాత్ర‌ను తెలుగు ఆడియెన్‌కి క‌నెక్ట్ చేసేంత బ‌ల‌మైన ఎమోష‌న్ ఉన్న‌ట్లు అనిపించ‌లేదు. అప్పూ ప్ర‌భాక‌ర్ కెమెరా వ‌ర్క్ అర‌కులోని స‌హ‌జ అందాల‌ను చ‌క్క‌గా చూపించాయి. బిజ్‌బ‌ల్ అందించిన పాట‌లు సిట్యువేష‌న్‌కు త‌గిన‌ట్టు అనిపిస్తాయి. నేప‌థ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండుంటే బావుండేది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ... స‌త్య‌దేవ్ మంచి న‌టుడు. ఇంకా గుర్తింపు తెచ్చుకునే పాత్ర‌లు చేయాల‌నే త‌ప‌న త‌న‌లో ఉంది. కాబ‌ట్టే ఓ పంథాలో ఉన్న సినిమాల‌ను చేయాల‌ని కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను, సినిమాలను చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు. మ‌హేశ్ పాత్ర‌లో స‌త్య‌దేవ్ ఒదిగిపోయాడు. వేరే హీరోను పెట్టి ఉంటే ఇమేజ్ ఇష్యూ కూడా వ‌చ్చుండేది. కానీ ఇక్క‌డ అలాంటి స‌మస్య లేదు. ఇక సీనియ‌ర్ న‌రేష్ క‌ట్లు క‌ట్టే నాటు వైద్యుడిగా పాత్ర‌కు న్యాయం చేశారు. ఇక సుహాస్ పాత్ర కూడా ఓకే. ఇక టీఎన్ఆర్‌, రామ్ ప్రసాద్ మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు గుర్తించ‌డం క‌ష్ట‌మే.

బోట‌మ్ లైన్‌: టైటిల్‌లోని ఉగ్రం సినిమాలో లేదు

Read UmaMaheswara UgraRoopasya Review in English

Rating : 2.8 / 5.0